జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సింగిల్ డోసు టీకాకు ఆమోదం

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అత్య‌వ‌స‌ర వినియోగం కింద ఆ టీకాల‌ను ఇవ్వ‌వ‌చ్చు అని ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.  దీంతో భార‌త్ త‌న వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని పెంచేసింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ఆమోదం ద‌క్క‌డంతో.. భార‌త్‌లో వినియోగించ‌నున్న అయిద‌వ టీకా కానున్న‌ది.

యురోపియ‌న్ యూనియ‌న్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మ‌న వ‌ద్ద ఉన్న‌ట్లు మంత్రి త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. జాన్స‌న్ సింగిల్ డోసు రాక‌తో.. కోవిడ్‌పై పోరాటం మ‌రింత బ‌లోప‌తం అవుతుంద‌ని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా  కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం ద‌క్కిన విష‌యం తెలిసిందే.

కాగా, రాబోయే రోజుల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా చేప‌డ‌తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ‌వ్యాప్తంగా శుక్ర‌వారం నాటికి భార‌త్ 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి కీల‌క మైలురాయిని అధిగ‌మించింద‌ని చెప్పారు. మ‌నం ఒక వారంలో ప‌లు దేశాల జ‌నాభా కంటే అధికంగా వ్యాక్సిన్ల‌ను వేస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. 

క‌రోనా మ‌హ‌మ్మారితో వాటిల్లిన కొలువుల న‌ష్టాన్ని అధిగ‌మించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. నిర్మాణ, మౌలిక రంగాల్లో ముమ్మ‌ర కార్య‌క‌లాపాల‌తో ఉపాధి క‌ల్ప‌న ఊపందుకుంటోంద‌ని చెప్పారు. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు చేయూత ఇస్తున్నామ‌ని, రైతుల‌ను ఊర‌ట క‌లిగించే చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు.