అక్టోబ‌ర్‌లో పెద్ద‌ల‌కు మ‌రో వ్యాక్సిన్‌

కోవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు డెవ‌ల‌ప్ చేసిన మ‌రో వ్యాక్సిన్ కొవోవాక్స్.. యువ‌జ‌నుల కోసం అక్టోబ‌ర్‌లో ఆవిష్క‌రిస్తామ‌ని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అదార్ పూనావాలా ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే, డీసీజీఐ అనుమ‌తులు రావాల్సి ఉంద‌ని చెప్పారు. 

పిల్ల‌ల కోసం వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రిలో పిల్ల‌ల‌కు కొవోవ్యాక్స్ వినియోగంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. 

శుక్ర‌వారం ఆయ‌న పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో స‌మావేశ‌మ‌య్యారు. అమిత్‌షాతో అదార్ పూనావాలా భేటీ 30 నిమిషాల పాటు సాగింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి కోసం త‌మ సంస్థ‌కు ప్ర‌భుత్వం అన్ని విధాల మ‌ద్ద‌తు అంద‌జేస్తుంద‌ని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే డిమాండ్‌ను అందుకునే విధంగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి విస్త‌రించ‌డానికి ఎల్ల‌వేళ‌లా త‌మ సంస్థ క్రుషి చేస్తుంద‌ని పూనావాలా తెలిపారు. ప్ర‌భుత్వం త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని అదార్ పూనావాలా చెప్పారు.

తాము న‌గ‌దు కొర‌త‌ను ఎదుర్కోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్ని విధాల మ‌ద్ద‌తు, స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు తెలిపారు. కొవోవ్యాక్స్ రెండు డోస్‌ల వ్యాక్సిన్ అని, దీని ధ‌ర‌ను ఆవిష్క‌ర‌ణ టైంలో వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్నారు. అంతకుముందు ఆరోగ్య మంత్రి మాన్‌సుఖ్ మాండ‌వియాతోనూ పూనావాలా భేటీ అయ్యారు.