400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యం

కొత్త మార్కెట్ల అన్వేషణ ద్వారా ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ 29.60 లక్షల కోట్లు) లక్ష్యాన్ని చేరే దిశగా కొవిడ్‌ నేపథ్యంలో ఏర్పడిన అవకాశాల్ని ఉపయోగించుకోవాలని, కొత్త ఎగుమతి కేంద్రాల్ని అన్వేషించాలని, ఎగుమతిచేసే ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవాలంటూ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 

విదేశాల్లోని భారత వాణిజ్య సంఘాలు, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్స్‌తో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫెరెన్సింగ్‌లో మాట్లాడుతూ కొవిడ్‌ తర్వాత అందివచ్చే ఎగుమతి అవకాశాలను ఏమాత్రం వదిలి పెట్టవద్దని స్పష్టం చేశారు. ఉత్పత్తి పెంచడం, రవాణా వ్యయాలు తగ్గించడం, దేశీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ల అన్వేషణ ద్వారా ఎగుమతుల్ని పెంచుకోవొచ్చని సూచించారు. 

ప్రస్తుతం మన జీడీపీలో ఎగుమతుల వాటా 20 శాతం మాత్రమేనని పేర్కొంటూ మనకున్న అవకాశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ప్రదాయి స్పష్టం చేశారు. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ఉత్పత్తి దృష్ట్యా ఎగుమతుల్ని బాగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నదని తెలిపారు. 

ఉత్పత్రి ప్రక్రియ గాడిన పడడం, లాజిస్టిక్స్‌ ఖర్చులు తగ్గడం, విదేశాల్లో భారత ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ ఇందుకు దోహదం చేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. ఏ దేశంలో ఏ ఉత్పత్తికి డిమాండ్‌ ఉందో ఆయా దేశాల్లోని భారత దౌత్య అధికారులు ఎగుమతిదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.

రెట్రోస్పెక్టివ్‌ టాక్స్‌ (వెనుకటి తేదీలతో వర్తించేలా పన్ను వేసే విధానం) రద్దుపై ప్రధాని మోదీ మాట్లాడుతూ విధానపరమైన నిలకడతోపాటు పెట్టుబడుల వాతావరణంలో స్థిరత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వ నిబద్దతకు ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. ‘విధానపరమైన నిలకడ’ ఎంత ముఖ్యమో విదేశాలతో వాణిజ్యం చేసే ఎగుమతిదారులకు బాగా తెలుసని  మోదీ చెప్పారు.