పాత లావాదేవీలపై పన్నులకు ఇక స్వస్తి

దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా వివాదాస్పదమైన రెట్రోస్పెక్టివ్‌ టాక్సేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇక ముగింపు పలకనుంది. గత లావాదేవీలపై తాజాగా పన్ను డిమాండ్‌ నోటీసుల్ని పంపి, పన్నులు వసూలుచేసే ఈ విధానాన్ని ఉపసంహరించేందుకు  లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బిల్లు ప్రవేశపెట్టారు.
 
విదేశీ సంస్థలతో పన్ను వివాదాలకు కారణమైన రెట్రోస్పెక్టివ్‌ టాక్సేషన్‌కు వీలు కల్పిస్తూ 2012లో చేసిన చట్టానికి సవరణగా టాక్సేషన్‌ లా బిల్లు 2021ను తాజాగా  లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.
వివాదాస్పద 2012 చట్టాన్ని రద్దు చేయడానికి ఒక బిల్లును కేబినెట్ ఆమోదించింది. వడ్డీ లేకుండా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే విదేశీ కంపెనీలు కెయిర్న్‌ ఎనర్జీ, వొడాఫోన్‌ తదితర కంపెనీలపై గతంలో జారీచేసిన టాక్స్‌ డిమాండ్లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది.
 
అలాగే రెట్రో టాక్స్‌గా ఇప్పటివరకూ వసూలుచేసిన రూ.8,100 కోట్లు ప్రభుత్వం ఆయా కంపెనీలకు వెనక్కు ఇచ్చివేస్తుంది. 2012లో రెట్రో టాక్స్‌పై చట్టం చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.1.1 లక్షల కోట్ల టాక్స్‌ డిమాండ్లను ఆదాయపు పన్ను శాఖ ఆయా కార్పొరేట్లపై జారీచేసింది. 
 
కెయిర్న్‌ ఎనర్జీ, వొడాఫోన్‌లు ఈ విషయంలో అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా, వాటికి అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో కెయిర్న్‌ ఎనర్జీ ఇటీవల ఎయిర్‌ ఇండియాకు అమెరికాలో ఉన్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు అక్కడి కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. 
కెయిర్న్‌ పిటిషన్‌ మేరకు పారిస్‌లో 1.2 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనపర్చుకునేందుకు ఫ్రాన్స్‌ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు, అత్యవసర రక్షణ రంగ సేవల బిల్లు-2021కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. 
 
రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు నిరసనలు తెలుపకుండా ఈ బిల్లు నిషేధం విధిస్తుంది. పునరావృత పన్ను నిబంధనను తొలగించే కొత్త బిల్లుపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడుతూ, భారతదేశాన్ని మెరుగైన పెట్టుబడి గమ్యస్థానంగా మార్చేందుకు పన్ను చట్ట సవరణ బిల్లు ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు.
ఈ సవరణ బిల్లు ఆమోదంతో ఐటి శాఖకు సంబంధించిన 17 పన్ను వివాదాలు పరిష్కారం అవుతాయని తెలిపారు.  హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ వొడాఫోన్‌పై పన్నుల భారం వల్ల భారతదేశం, నెదర్లాండ్స్ మధ్య ఒప్పంద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని తీర్పునిచ్చింది.