ముస్లిమేత‌రుల‌తో ముస్లింల వివాహం నిషేధిస్తున్న షరియా

ముస్లిమేత‌రుల‌తో ముస్లింల వివాహం విచార‌క‌ర‌మ‌ని అఖిల భార‌త ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) పేర్కొంది. ఈ త‌ర‌హా వివాహాల‌ను ష‌రియా నిషేధిస్తుంద‌ని ఏఐఎంపీఎల్‌బి తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మౌలానా ఖ‌లీద్ సైఫుల్లా ర‌హ్మానీ స్పష్టం చేశారు.  

మ‌తాంత‌ర వివాహాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు త‌ల్లితండ్రులు, సంర‌క్ష‌కులు, మ‌సీదుల ప్ర‌తినిధులు, మ‌ద‌ర్సాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ముస్లిం, ముస్లిమేతరుల మ‌ధ్య వివాహాన్ని ఇస్లాం అంగీక‌రించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. 

ఈ వివాహాల‌కు సామాజికంగా ఆమోదం ల‌భించినా ష‌రియా ప్ర‌కారం ఇవి చ‌ట్టబద్ధం కాద‌ని మౌలానా స్ప‌ష్టం చేశారు. మ‌తప‌ర‌మైన బోధ‌న‌లు, త‌ల్లితండ్రుల స‌రైన పెంప‌కం కొర‌వ‌డటంతో పాటు ప‌నిప్ర‌దేశాల్లో ప‌రిస్థితుల కార‌ణంగా ముస్లిమేత‌రుల‌తో మతాంత‌ర వివాహాలు పెరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.

ముస్లిమేత‌ర యువ‌కుల‌ను పెండ్లి చేసుకున్న ముస్లిం యువ‌తులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, కొంద‌రు ప్రాణాల‌ను కోల్పోతున్నార‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ముస్లిం యువ‌తుల‌కు వివాహం చేయ‌డంలో జాప్యం చేయరాద‌ని, ఇది మ‌తాంత‌ర వివాహాల‌కు దారితీస్తుంద‌ని త‌ల్లితండ్రుల‌ను మౌలానా హెచ్చరించారు.

కాగా, భార‌త్‌లో రివ‌ర్స్ ల‌వ్ జీహాద్ సాగుతోంద‌ని ముస్లిం ప్ర‌వ‌క్త సుఫియాన్ నిజామి ఏఐఎంపీఎల్‌బీ ప్ర‌క‌ట‌న‌ను స‌మ‌ర్ధిస్తూ వ్యాఖ్యానించారు. దేశ‌వ్యాప్తంగా ముస్లిం యువ‌తుల‌ను ప్రేమ పేరుతో ఆక‌ట్టుకుని మ‌తం మార్చుతున్నార‌ని నిజామి  తెలిపారు. ముస్లిం యువ‌తులు కేవ‌లం ముస్లింల‌నే పెండ్లి చేసుకోవాల‌ని స్పష్టం చేశారు.