భార్యకు ఇష్టంలేని సెక్స్ అత్యాచారమే

భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెతో లైంగిక కార్యకలాపాలు నిర్వహించడం వైవాహిక అత్యాచారమేనని కేరళ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి చర్య విడాకులు కోరడానికి ఓ కారణం కాగలదని జస్టిస్ ఏఎం ముస్తాక్, జస్టిస్ కౌసర్ ఎడప్పగథ్ ధర్మాసనం తెలిపింది. 

భర్త క్రూరత్వం కారణంగా తనకు విడాకులు మంజూరు చేయాలని భార్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అనుమతిస్తూ కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ భర్త దాఖలు చేసిన అపీలును హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసులో సంపద, సెక్స్ పట్ల భర్తకుగల మితిమీరిన కోరికలు విడాకులు కోరే విధంగా ఆయన భార్యను నిర్బంధించాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నైతికత లేని, క్రమశిక్షణరాహిత్యంతో, పోకిరీతనంతో కూడిన ఆయన ప్రవర్తనను సాధారణ దాంపత్య జీవితంలో భాగంగా పరిగణించలేమని పేర్కొంది. 

సంపద, సెక్స్ పట్ల తృప్తి లేని కోరికలు భార్యకు లేదా భర్తకు ఉండటాన్ని క్రూరత్వంగా పరిగణించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొంది. తన శారీరక, మానసిక సమగ్రతకు గౌరవం పొందే హక్కు ప్రతి వ్యక్తికీ ఉందని తెలిపింది. ఈ హక్కు పరిధిలోకి శారీరక సమగ్రత కూడా వస్తుందని స్పష్టం చేసింది.

దీనిని అగౌరవపరచడం, లేదా, ఉల్లంఘించడం జరిగితే, వ్యక్తిగత స్వయంప్రతిపత్తిని ఉల్లంఘించినట్లేనని వివరించింది. వ్యక్తికి తన మనోభావాలపై లేదా పరిస్థితిపై  నియంత్రణ ఉండటాన్నే స్వయంప్రతిపత్తి అంటారని తెలిపింది. వివాహంలో భార్య లేదా భర్త ఓ వ్యక్తిగా అటువంటి వ్యక్తిగత గోప్యతను సహజసిద్ధ, స్వాభావిక, అమూల్య హక్కుగా కలిగి ఉంటారని తెలిపింది. వైవాహిక గోప్యతకు సన్నిహితంగా, ఆంతర్యంగా వ్యక్తిగత స్వయంప్రతిపత్తితో సంబంధం ఉంటుందని తెలిపింది.

అటువంటి పరిధిలోకి శారీరకంగా లేదా మరొక విధంగా చొరబడటం వల్ల వ్యక్తిగత గోప్యత క్షీణిస్తుందని పేర్కొంది. ఈ పరిణామం క్రూరత్వం అవుతుందని వివరించింది. వైవాహిక, దాంపత్య సంబంధిత అత్యాచారాన్ని శిక్షా స్మృతి గుర్తించలేదనే అంశం అటువంటి అత్యాచారాన్ని విడాకుల మంజూరుకు ఓ కారణంగా గుర్తించకుండా నిరోధించబోదని వివరించింది.

చట్టపరమైన చిక్కుముడుల బంధంలో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా ఉండటానికి ప్రాధాన్యమిచ్చే మహిళ యొక్క సంఘర్షణను ఈ కేసు వివరిస్తోందని తెలిపింది. భర్తకు సంపద, సెక్స్‌లపైగల మితిమీరిన, తృప్తి లేని కోరికలు ఆయన భార్యను తీవ్రమైన నైరాశ్యంలోకి, ఇబ్బందుల్లోకి నెట్టినట్లు వివరించింది. 

విడాకులు పొందాలనే ఒత్తిడిలో ఆమె తన ఆర్థికపరమైన క్లెయిములను కూడా వదులుకున్నారని గుర్తు చేసింది. విడాకుల కోసం ఆమె చేసిన రోదన న్యాయాలయంలో ఓ దశాబ్దానికి పైగా కొనసాగిందని తెలిపింది. తన ప్రార్థనలకు ఫలితం కోసం ఆమె ఇప్పటికీ ఎదురు చూస్తున్నారని పేర్కొంది. 

వేరుపడటం కోసం చేసిన విజ్ఞప్తిపై స్పందించడంలో జరుగుతున్న జాప్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొంది. బహుశా ఆమె కన్నీళ్ళకు మనమే జవాబుదారీ కావచ్చునని తెలిపింది. ఇలాంటి ఉదాహరణ ఇదొక్కటే కాదని స్పష్టం చేసింది. ఆర్భాటాలు, భోగలాలసతలతో కూడిన జీవన శైలి, సంస్కృతి మన దృక్పథంలో గొప్ప మార్పులు తీసుకొచ్చినట్లు హైకోర్టు పేర్కొంది.

ఈ మార్పులు వివాహ వేడుకల్లో కూడా వచ్చాయని తెలిపింది. వ్యక్తులు లేదా సమాజం ప్రవచించడానికి ఇష్టపడే విలువలు ప్రతిబింబించకుండా, హోదాను ప్రదర్శించుకోవడానికి చిహ్నంగా వివాహాన్ని చూసినట్లయితే, వివాహానికి అవసరమైన మౌలిక భావనను మనం కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపింది. కుటుంబం అంటే సాంఘిక విభాగం అనే మౌలిక సూత్రం నెమ్మదిగా క్షీణిస్తోందని తెలిపింది. వ్యక్తులు ఏర్పరచుకున్న బంధపు మౌలిక సూత్రాన్ని గుర్తించడం లేదని పేర్కొంది.

వివాహం అంటే పవిత్రమైన బంధమనే ఆదర్శాలతోనూ, సమాజం పట్ల భయంతోనూ వేరుపడటానికి విముఖత చూపేవారు సమ్మతితో కూడిన స్వేచ్ఛాయుత చర్యపై నిరూపణ కోసం కోర్టును ఆశ్రయించడానికి  ఇకపై భయంలేదని తెలిపింది. ప్రస్తుత కేసులో భర్త క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్. కానీ ఆయన వైద్య వృత్తిని నిర్వహించడంలేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. వివాహ సమయంలో భార్య కుటుంబం ఆయనకు 501 బంగారు సావరిన్స్, ఓ కారు, ఫ్లాట్‌లను ఇచ్చింది. వేర్వేరు సందర్భాల్లో రూ.77 లక్షలు ఇచ్చారు.

కుటుంబ న్యాయస్థానం వీరిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ, ఈ కేసులో భర్త తన భార్యను డబ్బు ముద్రణ యంత్రంగా భావించాడని చెప్పింది. వైవాహిక బంధం అంటే తృప్తికి సంబంధించినదని హైకోర్టు తెలిపింది. ఇంట్లో ప్రశాంతత ఉంటే వివాహంలో సంతృప్తి కలుగుతుందని తెలిపింది. పరస్పర గౌరవం, నమ్మకం ద్వారా ప్రశాంతత, సామరస్యం వస్తాయని పేర్కొంది. భర్త చేసిన అప్పులు భార్యాభర్తలిద్దరి మధ్య వివాదానికి దారి తీసినట్లు పేర్కొంది. వైవాహిక జీవితంలో సెక్స్ అనేది దంపతుల మధ్య సాన్నిహిత్యానికి ప్రతిబింబమని వివరించింది.

ఈ కేసులో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అన్ని రకాల సెక్సువల్ పర్వర్షన్స్‌కు ఆమెను గురి చేశారని వ్యాఖ్యానించింది. బాధపడకుండా ఉండే అవకాశాన్ని ఎంపిక చేసుకునే అధికారం భార్యకు లేదా భర్తకు ఉంటుందని తెలిపింది. సహజ న్యాయం, రాజ్యాంగం ప్రకారం హామీగా లభించిన స్వయంప్రతిపత్తికి ఇది మౌలికమైనదని వివరించింది. కోర్టు ద్వారా విడాకులను నిరాకరించడం ద్వారా అతని లేదా ఆమె ఆకాంక్షకు విరుద్ధంగా బాధపడాలని భర్తను లేదా భార్యను చట్టం నిర్బంధించజాలదని స్పష్టం చేసింది.