కొద్దిలో చేజారిన మహిళల హాకీ కాంస్యం… ప్రధాని ప్రశంస

 ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు కాంస్య పథకాన్ని కొద్దిలో చేజార్చుకొంది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో బ్రిట‌న్ 4-3 గోల్స్ తేడాతో ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న‌ది. తుద వ‌ర‌కు భారత మహిళలు పోరాడినా, ఫోర్త్ క్వార్ట‌ర్స్‌లో చేతులెత్తేశారు. దీంతో ఒలింపిక్స్ హాకీలో చ‌రిత్ర సృష్టించే అద్భుత అవ‌కాశాన్ని మ‌హిళ‌ల జ‌ట్టు మిస్సైంది.

భార‌త మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు తృటిలో ప‌త‌కాన్ని మిస్ చేసుకున్న‌ట్లు ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలిపారు.మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌ను ఎన్న‌టికీ మ‌రువ‌లేమ‌ని మోదీ అన్నారు. మ్యాచ్ ఆద్యంతం అత్యుత్త‌మ ఆట‌ను ప్ర‌ద‌ర్శించార‌ని, జ‌ట్టులోని ప్ర‌తి ప్లేయ‌ర్ అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను, నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు ఆయ‌న కొనియాడారు. భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొన్నారు.

నిజానికి టీమిండియా వుమెన్ స్పూర్తిదాయ‌క‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది. తొలి క్వార్ట‌ర్‌లో రెండు జ‌ట్లు గోల్ చేయ‌లేక‌పోయాయి. స‌వితా పూనియా అద్భుత‌మైన రీతిలో గోల్ పోస్టు వ‌ద్ద బ్రిట‌న్ దూకుడును అడ్డుకున్న‌ది. ఇక సెకండ్ క్వార్ట‌ర్‌లో గోల్స్ వ‌ర్షం కురిసింది. బ్రిట‌న్ రెండు గోల్స్ చేయ‌గా ఇండియ‌న్ వుమెన్ మూడు గోల్స్ చేశారు.

గుర్జిత్ కౌర్ రెండు గోల్స్ చేసింది. మ‌రో ప్లేయ‌ర్ వంద‌నా క‌టారియా త‌న డ్రాగ్ ఫ్లిక్‌తో మ‌రో గోల్‌ను ఇండియాకు అందించింది. దీంతో రెండ‌వ క్వార్ట‌ర్‌లో ఇండియా త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక మూడ‌వ క్వార్ట‌ర్ కూడా ఆస‌క్తిక‌రంగా సాగింది.

గోల్ పోస్టును టార్గెట్ చేస్తూ దూకుడు ప్ర‌ద‌ర్శించిన బ్రిట‌న్ అమ్మాయిలు  ఆ క్వార్ట‌ర్‌లో ఒక గోల్ చేశారు. దీంతో రెండు జ‌ట్లు 3-3 గోల్స్‌తో స‌మంగా నిలిచాయి. టెన్ష‌న్‌గా మారిన నాలుగ‌వ క్వార్ట‌ర్‌లో.. బ్రిట‌న్ వుమెన్ త‌మ జోరును ప్ర‌ద‌ర్శించారు. 48వ నిమిషంలో గ్రేస్ బ‌ల్స‌డ‌న్ గోల్ చేయ‌డంతో బ్రిట‌న్‌కు ఆధిక్యం దక్కింది. చివ‌రి క్వార్ట‌ర్‌లో భార‌త మ‌హిళ‌లు తీవ్రంగా శ్ర‌మించినా ఫ‌లితం ద‌క్క‌లేదు.

భార‌త హాకీ జ‌ట్టులో ఉన్న మ‌హిళా ప్లేయ‌ర్ల‌కు హ‌ర్యానా ప్ర‌భుత్వం న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం టోక్యోకు వెళ్లిన హాకీ జ‌ట్టులో 9 మంది హ‌ర్యానా అమ్మాయిలే ఉన్నారు. అయితే ప్ర‌తి ప్లేయ‌ర్‌కు 50 ల‌క్ష‌ల క్యాష్ అవార్డు ఇవ్వ‌నున్న‌ట్లు హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్ తెలిపారు.
క్వార్ట‌ర్స్‌లోకి బ‌జ‌రంగ్ పూనియా
రెజ్లింగ్‌లో మెడ‌ల్ ఫెవ‌రేట్ బ‌జ‌రంగ్ పూనియా త‌న మ్యాచ్‌లో నెగ్గాడు. టోక్యో ఒలింపిక్స్ 65 కిలోల ఫ్రీ స్ట‌యిల్ మ్యాచ్‌లో ఇవాళ బ‌జ‌రంగ్ పూనియా  కిర్గిస్తాన్‌కు చెందిన బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఎర్న‌జ‌ర్ అక్మ‌త‌లేవ్‌పై విజ‌యం సాధించాడు. ర‌స‌వ‌త్త‌రంగా సాగిన బౌట్‌లో పూనియా పాయింట్ల ఆధారంగా గెలుపొందాడు. నిజానికి ఇద్ద‌రూ 3-3 స్కోర్ చేసినా.. తొలి పీరియ‌డ్‌లో టేక్‌డౌన్ వ‌ల్ల బ‌జ‌రంగ్‌కు విజ‌యం ద‌క్కింది.
ఫ‌స్ట్ పీరియ‌డ్‌లో బ‌జ‌రంగ్ పూనియా మూడు పాయింట్లు సాధించాడు. అయితే కిర్గిస్తాన్‌ ప్లేయ‌ర్ ఫ‌స్ట్‌ క్వార్ట‌ర్‌లో ఒక పాయింట్‌, సెకండ్ పీరియ‌డ్‌లో రెండు పాయింట్లు సాధించి స‌మంగా నిలిచాడు. కానీ విక్ట‌రీ బై పాయింట్స్ ఆధారంగా .. బ‌జ‌రంగ్ పూనియాను విజేత‌గా ప్ర‌క‌టించారు. క్వార్ట‌ర్స్‌లో ఇరాన్‌కు చెందిన ఘైసి చెకా మోర్టాజాతో బ‌జ‌రంగ్ పోరాడ‌నున్నారు.