పాక్ లో హిందూ ఆలయాల ధ్వంసంపై భారత్ సీరియస్ 

పాకిస్థాన్ లోని పంజాబ్ గ్రామీణ ప్రాంతం రహీమ్ యార్ ఖాన్ లో  హిందూ దేవాలయంపై దాడికి నిరసనగా భారతదేశం ఢిల్లీలోని  పాకిస్తాన్ ఛార్జ్ డి అఫైర్స్‌ అఫ్తాబ్ హసన్ ఖాన్‌ ను పిలిపించింది. హిందూ,  సిక్కు మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాల పట్ల భారతదేశం తన ఆందోళనను వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తన మైనారిటీ వర్గాల భద్రతకు భరోసా ఇవ్వాలని స్పష్టం చేసింది.

గణేష్ మందిరంలోని విగ్రహాలను ఒక గుంపు అపవిత్రం చేసిందని, ఆ ప్రదేశానికి నిప్పు పెట్టారని వచ్చిన వార్తలపై ఢిల్లీ స్పందించింది. కోపంతో ఉన్న గుంపు ఆలయం సమీపంలో ఉన్న కొన్ని హిందూ గృహాలపై దాడి చేసింది. హింసాత్మక సంఘటన నుండి ఇప్పటివరకు ఎటువంటి మరణాలు జరిగినట్లు నివేదికలు లేవు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ అధికారులు తెలిపారు.
“మైనారిటీ వర్గాలపై హింస, వివక్ష, హింస సంఘటనలు ప్రార్థనా స్థలాలపై దాడులతో సహా పాకిస్తాన్‌లో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి” అని భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో జరిగిన అనేక ఇతర సంఘటనలను గుర్తుచేశారు.  

జనవరి 4, 2020 లో సింధ్ లోని మాతా రాణి భాటియాని మందిరం, 2020 జనవరిలో గురుద్వారా శ్రీ జనమ్ స్థాన్, డిసెంబర్ 2020 లో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరాక్‌లోని ఒక హిందూ దేవాలయం సహా వివిధ దేవాలయాలు,  గురుద్వారాలపై దాడి జరిగినట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్‌లోని భద్రతా సంస్థలు అల్పసంఖ్యాక వర్గాలపై,  వారి ప్రార్థనా స్థలాలపై ఈ దాడులను నిరోధించడంలో పూర్తిగా విఫలమయ్యాయని బాగ్చి విమర్శించారు.

ఫిబ్రవరిలో ప్రకటించిన నియంత్రణ రేఖపై కాల్పుల విరమణపై ఒప్పందం తరువాత కొద్దిసేపు ఆశలు చిగురించిన తర్వాత, భారత్-పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ మొదటికి వచ్చాయి. బ్యాక్-ఛానల్ దౌత్యం, ఉద్రిక్తతను తగ్గించడం ద్వారా రెండు ప్రభుత్వాలు శాంతి ప్రయత్నాలపై విస్తరిస్తాయనే అంచనాలు త్వరగా అబద్ధమయ్యాయి.

భారత్ కు చెందిన ఐదుగురు విదేశీ జర్నలిస్టుల బృందాన్ని వాఘా సరిహద్దు ద్వారా ఇస్లామాబాద్‌కి వెళ్లేందుకు అనుమతించాలన్న పాకిస్తాన్ అభ్యర్థనను తిరస్కరించిన నివేదికల గురించి అడిగినప్పుడు, బాగ్చి ఈ రహదారిని ఎప్పుడో మూసివేసినది పాక్ అని స్పష్టం చేశారు.

“న్యూఢిల్లీలో ఉన్న కొంతమంది విదేశీ జర్నలిస్టుల క్రాస్ ఓవర్ గురించి సోమవారం ఒక అభ్యర్థన చేశారని నేను అర్థం చేసుకున్నాను. కానీ కొంతకాలం క్రితం పాకిస్తాన్ ఈ దారిని మూసివేసిన కారణంగా ఇది జరగలేదు” అని బాగ్చి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మొత్తం పరిస్థితులపై అత్యున్నత రాజకీయ నాయకత్వం మరియు సీనియర్ అధికారులతో పరస్పర చర్చల కోసం జర్నలిస్టులను ఇస్లామాబాద్‌కు తీసుకెళ్లాలని పాకిస్తాన్ యోచిస్తోంది.
 
ఆఫ్ఘన్ సంక్షోభం 

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి భారత్-పాక్ సంబంధాలను మరింత క్లిష్టతరం చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులపై రెండు దేశాల మధ్య దూరం పెరుగుతున్నది.  ఆఫ్ఘన్ అధ్యక్షుడుగా ఎన్నికైన అష్రఫ్ ఘనీ  ప్రభుత్వానికి ఢిల్లీ మద్దతు ఇస్తుండగా, కాబూల్‌లో ప్రస్తుత ప్రభుత్వంతో పాకిస్థాన్ సంబంధాలు బెడిసికొడుతున్నాయి. ఆఫ్ఘన్ సైన్యంతో పోరాడుతున్న తాలిబాన్లకు మద్దతు ఇచ్చినందుకు ఇస్లామాబాద్‌ని ఘనీ బృందం నిందిస్తున్నది.

ఆఫ్ఘనిస్తాన్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి,  పోరాటం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పౌరుల మరణాలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ పరిష్టితులపై నేడు చర్చ జరగనుంది.   

ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి రెండేళ్లపాటు మండలి శాశ్వత సభ్యత్వానికి ఎన్నికైన భారతదేశం, ఆగస్టు నెలలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఈ వారం ప్రారంభంలో తన భారతీయ సహచరుడితో ఫోన్‌లో మాట్లాడి, మండలిలో ఆఫ్ఘన్ పరిస్థితులపై   లో చర్చించాలని కోరారు.

“మహిళలు, మైనారిటీలతో సహా ఆఫ్ఘన్ సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలు, శాంతియుత, ప్రజాస్వామ్య, సంపన్న భవిష్యత్తు కోసం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో మేము ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, ప్రజలకు మద్దతు ఇస్తున్నాము. మేము అభివృద్ధి చెందుతున్న భద్రతా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము” అని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు.  

తక్షణ, సమగ్ర కాల్పుల విరమణ కోసం మేము పిలుపునిస్తూనే  ఉన్నామని చెబుతూ, తాము ఆఫ్ఘన్ నేతృత్వంలోని, ఆఫ్ఘన్ యాజమాన్యంలోని, ఆఫ్ఘన్-నియంత్రిత శాంతి ప్రక్రియకు మద్దతు ఇస్తున్నామని బాగ్చి తేల్చిచెప్పారు. 
పాక్ సుప్రీం కోర్ట్ విచారణ 

ఇలా ఉండగా,  పాకిస్థాన్‌ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో సిద్ధి వినాయక ఆలయంపై దుండగుల దాడి ఘటనపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. దేవాలయంపై దాడి ఘటనపై పాక్ హిందూ కౌన్సిల్ చీఫ్ ప్యాట్రన్ రమేష్ కుమార్ వాంక్వానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ను కలిశారు.

ఈ ఘటనపై శుక్రవారం (నేడు) విచారణ చేపట్టనున్నందున విచారణకు హాజరు కావాలని పంజాబ్ ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ, పోలీసు చీఫ్ లను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. రహీంయార్‌ ఖాన్‌ జిల్లా భోంగ్‌ నగరంలో బుధవారం రాత్రి ఆలయంపై దుండగులు ఇనుప రాడ్లు, కర్రలు, కట్టెలు తీసుకొని  దాడికి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై భారతదేశం స్పందించి పాకిస్థాన్ దేశంలోని మైనారిటీల భద్రతకు భరోసా కల్పించాలని కోరింది. దీంతో స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆలయంపై జరిగిన దాడిని ఖండించారు. ఆలయంపై దాడికి పాల్పడిన దోషులందరినీ అరెస్టు చేయాలని తాను ఐజీని ఆదేశించడంతో పాటు ఆలయాన్ని పునరుద్ధరిస్తామని ఇమ్రాన్ ఖాన్ ఆలస్యంగా ట్వీట్ చేశారు.