హాకీ ఒలింపిక్స్ పతాకం అసలు హీరో నవీన్ పట్నాయక్!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల, పురుషుల బృందాలు సెమీ ఫైనల్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లువెత్తింది. నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి హాకీ లో స్వర్ణయుగం ప్రారంభమైనదని దేశవాసులలో సంబరాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
హాకీ భారతీయ క్రీడా.  ఒకప్పుడు 1920 నుంచి 1950 లోపు జరిగిన ఒలింపిక్స్ లో మన దేశం ఒలింపిక్స్ లో దుమ్ముదులిపింది. ధ్యాన్ చంద్ ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసేది. ధ్యాన్ చంద్ అనంతరం కూడా కొన్ని సంవత్సరాల పాటు హాకీలో మన ఆధిపత్యం స్పష్టం గా కొనసాగింది. 
 
అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు హాకీ పట్ల నిరాదరణ ప్రదర్శిస్తూ, క్రికెట్ మోజులో పడడంతో మన దేశపు హాకీ ఘనత దిగజారుతూ వస్తున్నది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు క‌నీసం అర్హ‌త సాధించ‌లేక చ‌తికిల‌ప‌డింది. 
 
 భారతదేశం హాకీలో చివరిసారిగా ఒలింపిక్ పతకం సాధించింది 1980లో శొవిఎత్ యూనియన్ లో జరిగిన ఒలింపిక్స్ లో. అయితే అప్పటి పరిస్థితులు వేరు. మన దేశంలో చెప్పుకోదగిన మద్దతు లేకపోయినా ఆ క్రీడలను అనేక దేశాలు బహిష్కరించడం, అమెరికా – సోవియట్ యూనియన్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉండడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యే దశలు ఉండడం భారత్ కు కలసి వచ్చాయి. 
 
ఆ తర్వాత శిఖర స్థాయి నుంచి అధమ స్థాయికి  పాకిపోస్తున్న ఇండియన్ హాకీ 41 ఏళ్ళ తర్వాత ఒలింపిక్స్ లో పతాకం గెలుపొందడం దేశమంతటా సంబరాలకు దారితీస్తుంది. ఈ సంబరాలకు అందుకు ప్రధాన కారణం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పవచ్చు. 
ఈ విజయోత్సవాలు ప్రధానమైన హీరో ఆయనే అనడంలో అతిశయం అంటూ ఏమీ లేదు. 
భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు ఐదేళ్ల పాటు అంటే 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్‌షిప్‌ చేస్తుందంటూ 2018లో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. ఈ చారిత్రక నిర్ణయమే 41 ఏళ్ల అనంతరం హాకీలో భారత్‌ తిరిగి స్వర్ణయుగానికి చేరుకునేందుకు కారణమైందని స్పష్టం అవుతున్నది.
ఇది భారత హాకీకి పునరుత్తేజితాన్ని అందించడమే కాకుండా భారత హాకీని ఉన్నతంగా నిలబెట్టిందని.. ఇది అసాధారణమైన నిర్ణయమని సోషల్ మీడియాలో అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.  దేశవ్యాప్తంగా క్రికెట్‌కు నీరాజనాలిందిస్తున్న సమయంలో నవీన్‌ పట్నాయక్‌ హాకీకి మద్దతుగా నిలిచారు. అలాగే సుందర్‌గఢ్‌ జిల్లాలో ఉన్న గిరిజన యువతలో హాకీలో ఉన్న ప్రతిభను వెలికి తెచ్చేందుకు కృషి చేశారు. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కూడా కల్పించారు.
 
20వేల మంది ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియాన్ని సుందర్‌గఢ్‌ జిల్లా రూర్కెలాలో ఉంది. 2023లో జరగనున్న పురుషుల హాకీ వరల్డ్‌ కప్‌ ఈ స్టేడియంలో జరగాల్సి వుంది. అలాగే భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ని హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌గా మార్చారు. ఇది క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణా సౌకర్యాలను అందిస్తోంది.
 
మహిళల జట్టు సహితం కూతవేటు దూరంలో పతకాన్ని కోల్పోయింది.  కానీ వారి అద్భుతమైన నైపుణ్యం, గ్రిట్ ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా హాకీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది.  జాతీయ టీమ్‌లకు ఒక రాష్ట్రం స్పాన్సర్‌ షిప్‌ను అందించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
 
అన్నింటికంటే, నవీన్ పట్నాయక్ తన చిన్నతనంలో ఈ క్రీడా  ఆడేవారు. డూన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు గోల్ కీపర్‌గా హాకీ ఆడారు. వాస్తవానికి, భారత హాకీ మాజీ కెప్టెన్,  బిజెడి ఎంపి దిలీప్ టిర్కీ ఒడిషా ముఖ్యమంత్రిని పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్ చేయడానికి ఒప్పించారు.
 
చాలాన్నాళ్లుగా ఇండియ‌న్ హాకీ టీమ్ స్పాన్స‌ర్‌గా  కొనసాగుతున్న స‌హారా 2018లో టీమ్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి త‌ప్పుకుంది. ఎవ‌రూ టీమ్‌ను స్పాన్స‌ర్ చేయ‌డానికి ముందుకు రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో ఒడిశాలోని నవీన్ ప‌ట్నాయ‌క్ ప్రభుత్వం హాకీ ఇండియాను ఆదుకుంది. 
 
ఐదేళ్ల‌కుగాను హాకీని స్పాన్స‌ర్ చేయ‌డానికి ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే మ‌ళ్లీ ఇండియ‌న్ హాకీ టీమ్ రాత‌ను మార్చింది. 2014లో ఒడిశా ప్ర‌భుత్వం చాంపియ‌న్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్య‌మిచ్చింది. 
 
అప్పుడే ఒడిశా స్పాన్స‌ర్‌షిప్‌కు బీజం ప‌డింది. ఆ టోర్నీపై న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. ఆ త‌ర్వాత 2017లో ఒడిశా ప్ర‌భుత్వం స్పాన్స‌ర్‌గా ఉన్న క‌లింగ లాన్స‌ర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఫెడ‌రేష‌న్ మెన్స్ సిరీస్ ఫైన‌ల్స్‌, ఒలింపిక్ హాకీ క్వాలిఫ‌య‌ర్స్‌ 2020లో నవీన్ ప్రోత్సాహంతోనే  జరిగాయి. 
 
ఇక 2018లో హాకీ వ‌ర‌ల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వ‌హించింది. ఆ త‌ర్వాత 2019లో ఇంట‌ర్నేష‌న‌ల్ హాకీ  ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జ‌రిగాయి. ఇలా ఇండియ‌న్ హాకీ వేసే ప్ర‌తి అడుగులోనూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ తెర వెనుక హీరోగా ఉంటూ వ‌స్తున్నారు.

హాకీ ఇండియా ప్రస్తుత నవీన్ పట్నాయక్ ప్రభుత్వంతో ఒప్పందం 2023 వరకు కొనసాగుతుంది. అదే సంవత్సరం భారతదేశం అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిస్తుంది.
 
ఒడిశాలో హాకీని క్రీడ కన్నా ఎక్కువగా భావిస్తారని, గిరిజన ప్రాంతాల్లో జీవన విధానమే హాకీతో ముడిపడి ఉందని, ఇక్కడి పిల్లలు హాకీ స్టిక్‌లతోనే నడక నేర్చుకుంటారనడంలో ఆశ్చర్యం నవీన్ఈ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల, పురుషుల హాకీ జట్‌ల వైస్‌ కెప్టెన్స్‌ ఒడిశాకు చెందినవారు కావడం, పైగా వీరిద్దరూ కూడా సుందర్‌గఢ్‌ జిల్లాకు చెందినవారు కావడం విశేషం.
 
2021 ఆగస్ట్‌ 3న రెండు టీమ్‌లు టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరేడానికి రెండు రోజుల ముందు పట్నాయక్‌ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రముఖ వార్తాపత్రిక ‘ఒడిశా డైలీస్‌’లో పూర్తి పేజీని వారికి స్పూర్తినిచ్చేలా ప్రకటనలకే కేటాయించింది.