సరిహద్దుల్లో భారత్, చైనా సైనికులు వెనుకకు

భారత్ – చైనా సరిహద్దుల్లో మూడో రౌండ్ బలగాల ఉపసంహరణ పక్రియ విజయవంతంగా పూర్తయింది. తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద గోగ్రా హైట్స్ ప్రాంతం నుంచి రెండు దేశాలూ తమ సైనిక మోహరింపును వెనక్కి తీసుకున్నాయి. చుషుల్‌ మోల్డో ప్రాంతంలో జులై 31న జరిగిన రెండు దేశాల మధ్య 12వ రౌండ్ ఆర్మీ కమాండర్ లెవెల్‌ చర్చలు జరిగిన విషయం తెలిసిందే.

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు లేకుండా శాంతి నెలకొనేందుకు రెండు దేశాలూ లోతైన చర్చలు జరిపాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆ చర్చల్లో భాగంగా రెండు దేశాలు తమ ఆర్మీ సైనికులను వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి తీసుకునేందుకు అంగీకరించాయని, ఇందులో భాగంగా మూడో దఫా ఉపసంహరణలు జరిగాయని చెప్పాయి. 

ఇప్పటికే గతంలో ప్యాంగాంగ్ త్సో, గాల్వన్ ఏరియాల నుంచి రెండు రౌండ్లలో ఇరు దేశాలు బలగాలను వెనక్కి తీసుకున్నాయి. తాజాగా జులై 31న జరిగిన సమావేశంలో గోగ్రా ప్రాంతంలోని బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. 

ఆ ప్రాంతంలో వాస్తవాధీన రేఖను యథావిధిగా కొనసాగించేలా ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక వెస్ట్రన్ సెక్టార్‌‌లోని వివాదాస్పద ప్రాంతాల్లోనూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చల కొనసాగించాలని రెండు దేశాలూ అంగీకారానికి వచ్చాయని ఆర్మీ వర్గాలు చెప్పాయి.

గత ఏడాది మే నెల నుంచి గోగ్రా ప్రాంతంలో భారత్, చైనా బలగాల మధ్య ఫేస్‌ ఆఫ్ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన సమావేశంలో శాంతియుత వాతావరణం కోరుకుంటూ రెండు దేశాలు ఇకపై ఎటువంటి బలగాల మోహరింపు చేపట్టొద్దని అంగీకారానికి వచ్చాయి.

అలాగే దశల వారీగా ఉన్న బలగాలను వెనక్కి పంపాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఆగస్టు 4, 5 తేదీల్లో బలగాలను వెనక్కి పంపేశాయి. గోగ్రా ప్రాంతం నుంచి యథావిధి తమ పూర్వపు పర్మినెంట్ బేస్‌లకు చేర్చాయి. గడిచిన మూడు నెలలుగా గోగ్రా హైట్స్‌లో నిర్మించిన తాత్కాలిక క్యాంపులను రెండు వైపులా తొలగించినట్లు ఆర్మీ వర్గాలు వెరిఫై చేశాయి.

గత ఏడాది ప్యాంగాంగ్, హాట్‌ స్ప్రింగ్, గాల్వన్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఆ తర్వాత నిరుడు జులై నెలలో గాల్వన్‌లో సైనికుల మధ్య తీవ్రమైన కొట్లాట జరిగిన 20 మంది భారత సైనికులు మరణించడం ఆ తర్వాత రెండు దేశాలు భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించడం తెలిసిందే.

అయితే క్రమంగా దశల వారీగా దౌత్య, ఆర్మీ కమాండర్ స్థాయిల్లో చర్చల ద్వారా బలగాలను ఉపసంహరిస్తూ ఉద్రిక్తతలను ఉపసంహరించేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. తూర్పు ల‌డాఖ్‌లోని గోగ్రా ప్రాంతంలో ఉన్న ద‌ళాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ ప్రకటించింది. దీంతో అక్క‌డ నియంత్రణ రేఖకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు తెలిపింది. తాత్కాలిక క‌ట్ట‌డాల‌ను తొల‌గించిన‌ట్లు కూడా  స్ప‌ష్టం చేసింది