యూపీఏ హయాంలో 11 బిల్లులు చర్చ లేకుండా ఆమోదం

పార్లమెంటులో ఎలాటి చర్చలు లేకుండానే వివిధ బిల్లులను ప్రభుత్వం హడావిడిగా ఆమోదిస్తోందంటూ విపక్షాలు కేంద్రంపై చేస్తున్న ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 11 బిల్లులను హడావిడిగా ఆమోదించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ స్వయంగా ఈ విషయం అంగీకరించారని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె తెలిపారు. ”ప్రభుత్వం హడావిడిగా బిల్లులు ఆమోదిస్తున్నట్టు విపక్షాలు మట్లాడుతున్నాయి. 2007, 2011లో హడావిడిగా రాజ్యాంగ బిల్లులతో సహా 11 బిల్లులను యూపీఏ సర్కార్ ఆమోదించింది” అని ఆమె పేర్కొన్నారు. తాము విపక్షాలను సభలో చర్చించమని అంటున్నామని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ వాళ్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

కాగా,  మోదీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పది రోజుల్లో 12 బిల్లులు హడావిడిగా ఆమోదించారని, ‘పాప్రి చాట్’ చుట్టేసినట్టు ఒక్కో బిల్లు కేవలం ఏడు నిమిషాల్లోనే ఆమోదించేసారని ఆరోపిస్తూ ఇంతకు ముందు టిఎంసి ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు. ఉభయసభల్లోనూ పెగాసస్ ప్రాజెక్టుపై విపక్షాల ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ  ప్రభుత్వం మాత్రం బిల్లులను ఆమోదించుకుంటూ పోతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

కాగా,  లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో ఇవాళ కూడా విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. సాగు చ‌ట్టాలు, స్నూపింగ్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశాయి. దీంతో ఉభ‌య‌స‌భ‌ల‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు. వ‌ర్షాకాల స‌మావేశాల్లో మూడ‌వ వారం ముగియ‌డానికి వ‌చ్చింద‌ని, కానీ ఇంత వ‌ర‌కు ఎటువంటి స‌భావ్య‌వ‌హారాలు సాగ‌లేద‌ని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ విచారం వ్యక్తం చేశారు. విప‌క్షాల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చించాల‌ని ఆయ‌న కోరారు. 

మ‌రోవైపు ప‌న్ను చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. ప‌న్ను చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లుతో త‌మ వాగ్దానాల‌ను నెర‌వేర్చిన‌ట్లు కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.