సరిహద్దు సమస్యలపై అస్సాం, మేఘాలయ మంత్రుల కమిటీలు 

అంతర్రాష్ట్ర సరిహద్దుల సమస్యల పరిష్కారం కోసం అస్సాం, మేఘాలయ ముఖ్యమంత్రులు శుక్రవారం సమావేశమయ్యారు. కేబినెట్ మంత్రుల నేతృత్వంలో ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  చారిత్రక అంశాలు, సహజసిద్ధ స్థానికత, పరిపాలనా సౌలభ్యం వంటివాటిని పరిశీలించి, నివేదికలను 30 రోజుల్లోగా సమర్పించాలని నిర్ణయించారు. 

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా శుక్రవారం గువాహటిలో సమావేశమయ్యారు. వారిద్దరూ తమ రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యల గురించి చర్చించారు. అనంతరం సంయుక్త విలేకర్ల సమావేశంలో సంగ్మా మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలను దశలవారీగా పరిష్కరించుకోవడం కోసం కేబినెట్ మంత్రుల నేతృత్వంలో ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

చరిత్రకు సంబంధించిన యథార్థాలు, సహజసిద్ధ స్థానికత, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలపై ఈ కమిటీలు పరిశీలన జరుపుతాయని చెప్పారు. ఈ కమిటీలు నివేదికలను 30 రోజుల్లోగా అందజేసే విధంగా ఆదేశిస్తామని చెప్పారు. వివాదంలోని 12 ప్రాంతాల్లో ఆరింటిపై అస్సాం ప్రభుత్వం ఇచ్చిన సవివరమైన ప్రజంటేషన్‌ను ఈ సమావేశంలో పరిశీలించినట్లు సంగ్మా చెప్పారు.

విభేదాలుగల ఈ ఆరు ప్రాంతాలు మూడు రీజియన్లలో ఉన్నట్లు తెలిపారు. అస్సాం, మేఘాలయలకు చెందిన చెరొక మూడు కమిటీలు చరిత్రకు సంబంధించిన వాస్తవాలు, సహజసిద్ధ స్థానికత, పరిపాలన సౌలభ్యం, సమ్మతి వంటివాటిపై పరిశీలన జరుపుతాయని పేర్కొన్నారు. 

హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, తమ ప్రభుత్వాలు సరిహద్దులను తిరిగి నిర్ణయించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాలు లేదా గ్రామాలపై భావాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సరిహద్దులను మార్చవలసిన అవసరం ఉంటుందని భావిస్తే, తాము ఆ విషయాన్ని పార్లమెంటుకు సిఫారసు చేస్తామని చెప్పారు.