రాయలసీమ పథకంపై స్వయంగా కృష్ణ బోర్డు తనిఖీ!

రాయలసీమ ఎత్తిపోతల పనులు తనిఖీ చేయడానికి వచ్చే బృందంలో తెలంగాణకు చెందిన అధికారిని ఎలా నియమిస్తారంటూ ఎపి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్వయంగా తనిఖీ చేపట్టడానికి కృష్ణ బోర్డు సంసిద్దమైనది. ఈ మేరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)లో దాఖలు చేసిన అప్లికేషన్‌ను బుధవారం జస్టిస్‌ రామకృష్ణన్‌, విషయ నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 

తనిఖీ బృందంలో కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) నుంచి నియమితులైన వ్యక్తి తెలంగాణకు చెందినవారని ఎపి అభ్యంతరం చెబుతుందని, స్వయంగా తామే తనిఖీ చేపడతామని ధర్మాసనానికి కృష్ణా బోర్డు తెలిపింది.

 సిడబ్ల్యుసి నుంచి వచ్చే వ్యక్తి తెలంగాణకు చెందినప్పటికీ యుపిఎస్‌సి సర్వీసు నుంచి ఎంపికయ్యారని, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి కాదని తెలంగాణ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌ తరపు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

ధర్మాసనంలోని విషయ నిపుణుడు సత్యగోపాల్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని తాము కూడా ఆరోపించగలం అని రామచంద్రరావు పేర్కొన్నారు. ఇతర సభ్యులెవరూ లేకుండానే కృష్ణా బోర్డు తనిఖీ చేస్తానంటోంది కాబట్టి చేయనిద్దామని జస్టిస్‌ రామకృష్ణన్‌ పేర్కొన్నారు. 

ఉభయ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు లేకుండా కృష్ణా బోర్డు తనిఖీ చేస్తానంటే అభ్యంతరం లేదని ఎపి ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం డిపిఆర్‌ కోసం పనులు చేపడుతున్నారా? పిటిషనర్‌, తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతున్నారా? తనిఖీ చేసి చెప్పాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. 

దీంతో, నివేదిక అందించడానికి మూడు వారాలు సమయం కావాలని కృష్ణా బోర్డు కోరింది. నివేదికను పై అధికారులకు పంపి అనుమతి వచ్చిన తర్వాత ట్రిబ్యునల్‌కు అందజేయాల్సి ఉంటుందని బోర్డు తరపున న్యాయవాది తెలిపారు. ఆదేశించిన మేరకు షార్ట్‌ రిపోర్టు ఫైల్‌ చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.