సుప్రీం’లో కృష్ణ జలాల వివాదం మరో బెంచ్ కు

కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మరో ధర్మాసనానికి బదిలీ చేసింది.

కృష్ణా జలాల వివాదం న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 

కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటూ, ఆంధ్రపదేశ్‌కి తాగునీటిని, సాగు నీటిని నిరాకరిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాది ఉమాపతి తన వాదనలు వినిపిస్తూ దీనికి న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. 

 మీరు మధ్యవర్తిత్వం వద్దనుకుంటే మేమేమీ బలవంతం చేయం. ఈ కేసు మరో బెంచికి నివేదిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ ఇదివరకే చెప్పారు. ఆ ప్రకారమే ఈ చర్య తీసుకున్నారు.  తొలుత కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ, సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని విచారిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పారు. 

దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా న్యాయపరమైన అంశాల్లో విచారణ చేయబోనని, దీనిని వేరే బెంచికి బదిలీ చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాధన్‌ కోర్టుకు హాజరయ్యారు.

ఇప్పుడు ఏర్పాటు అయిన ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యపు బెంచ్‌కు ఇప్పటి పరిణామంతో గండిపడింది. దీనితో మరో ధర్మాసనం ఏర్పాటు కావల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి వివరణ వెలువడలేదు. ఇక మధ్యవర్తిత్వ ప్రక్రియ విషయం ఆంధ్రప్రదేశ్ వైఖరితో ఇప్పుడు మూలకు వెళ్లింది. ఈ క్రమంలో కృష్ణ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ క్రమం జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.