రఘురామరాజును చంపేస్తానని వైసిపి ఎంపీ మాధవ్ బెదిరింపు

ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే తనను వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ చంపేస్తానని బెదిరించినట్లు వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది.ఆ మేరకు లోక్ సభ స్పీకర్ తో పాటు ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లకు ఫిర్యాదు చేశారు.
 
మంగళవారం మధ్యాహ్నం సుమారు 11.50, 12.00 గం సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పలువురు సహచర పార్లమెంటు సభ్యులతో తాను మాట్లాడుతున్న సమయంలో తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ తన వద్దకు వచ్చి సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఎంతో అసభ్యకరమైన పదాలతో తనను బూతులు తిడుతూ, తన అంతు చుస్తానంటూ బెదిరించాడని ఆ లేఖలో ఆయన ఆరోపించారు.
పదిమందిలో అతనిపై తిరిగి స్పందించడం సరికాదని ఆ సమయంలో సంయమనం పాటించి, తర్వాత జరిగిన విషయం లోక్ సభ స్పీకర్ గారికి తెలుపుతూ లేఖ రాసి, వ్యక్తిగతంగా పలువురు ఎంపీలతో కలిసి అందజేశానని తెలిపారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకుంటానని లోక్ సభ స్పీకర్ గారు హామీ ఇచ్చిన్నట్లు తెలిపారు.

కాగా, ఈ విషయాన్ని తాను అంత తేలికగా వదిలేయాలని అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.  ఒక పార్లమెంటు సభ్యునిపై పార్లమెంటు సెంట్రల్ హాల్ లోనే ఇలా అసభ్య పదజాలంతో దాడి చేయడం వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు అవసరమైతే ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వెనుకాడనని వెల్లడించారు.

ఇటువంటి హత్యా బెదిరింపులకు మానుకొంటే మంచిదని ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రికి ఆయన హితవు చెప్పారు. జరిగిన ఈ సంఘటన వెనుక నిజంగా ఆయన ప్రమేయం లేకపోతే ఎంపీ గోరంట్ల మాధవ్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. 
 
మరోవంక, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ  రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు వెంకటేశ్‌ సిద్దాని, పీఎస్‌ మూర్తి మంగళవారం ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యసభ ఎంపీగా తనకు కేంద్ర మంత్రులతో సంబంధాలున్నాయంటూ సాక్షులను భయపెడుతున్నారని అందులో పేర్కొన్నారు.