ఉపాధి హామీ బిల్లుల తీరుపై హైకోర్టు ఆగ్రహం 

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై  రాష్ట్రహైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను సర్కారు తేలిగ్గా తీసుకుంటుందని అసహనం వ్యక్తం చేసింది. 

నెలరోజుల్లో బిల్లులు చెల్లించాలని గతేడాది జనవరి 8న కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటే  హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని  సుప్రీంకోర్టులో అప్పీల్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. 

ఉపాధి పనుల్లో కొన్నిచోట్ల అక్రమాలు జరిగాయనే కారణంతో అన్ని పనుల్లోనూ 20 శాతం కోత విధించడం ఏంటని నిలదీసింది. విజిలెన్స్‌ ఎంక్వైరీలో ఏంతేలిందని పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజాశంకర్‌ను ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

విజిలెన్స్‌ నివేదికను అధ్యయనం చేయకుండా విచారణకు హాజరుకావడం ఏంటని నిలదీసింది. మరోవైపు బుధవారం విచారణకు  ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రాకపోవడంపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు గౌరవించేది అలాగే అంటూ సూటిగా ప్రశ్నించింది. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వేసిన అఫిడవిట్‌లో సైతం కారణాలు పేర్కొనకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టుకు హాజరు కాకపోవడంపై కోర్టుకు ఎస్‌జీపీ క్షమాపణలు చెప్పారు. సమావేశం నిమిత్తం ఆర్థిక కార్యదర్శి ఢిల్లీ వెళ్లారని, తదుపరి విచారణకు హాజరవుతారని నివేదించారు.

 రాష్ట్ర ప్రభు త్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ స్పందిస్తూ  ధర్మాసనం ఆదేశాలను అమలు చేయడం మొదలుపెట్టామని, కేంద్రం నిధులు రావాల్సి ఉందని, నాలుగు వారాల్లో పూర్తిగా బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ… ప్రభుత్వం చెప్పే లెక్కలు వినేందుకు తాము సిద్ధంగా లేమని పేర్కొంది.  

చెల్లింపుల పురోగతిపై తమకు ఆసక్తి లేదని… కోర్టు ఆదేశాలు అమలు చేశారా? లేదా? అనేదే ముఖ్యమని స్పష్టం చేసింది. తాము చర్యలకు ఉపక్రమించేందుకు సమయం ఆసన్నమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. విచారణను 18కి వాయిదా వేసింది. 

ఆ రోజు పంచాయతీ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి తప్పక హాజరుకావాలని, కోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. లేదంటే కోర్టు ధిక్కరణ కింద చర్యలు ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.