దేశీయంగా రూపొందిన విక్రాంత్‌ జల ప్రవేశం

దేశీయంగా రూపొందిన విమాన వాహక నౌక విక్రాంత్‌ బుధవారం జల ప్రవేశం చేసింది. ఈ నౌక డిజైన్‌తో పాటు నిర్మాణాన్ని కూడా భారత్‌ చేపట్టింది. 1971 యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌కు 50 ఏళ్లు పూర్తికానున్నాయి. ఇదే రోజు ఈ దేశీయ యుద్ధనౌక ట్రయల్స్‌ను చేపట్టనుండటం గమనార్హం. 

ఇదో చారిత్రాత్మక సంఘటనగా భారతీయ నౌకాదళం అభివర్ణించింది. ఎన్నో విశిష్టతలు, శక్తివంతమైన ఈ అతి భారీ విమాన వాహక నౌకకు సముద్రంలో పాటవ పరీక్షలు ప్రారంభం కావడంతో ఇలాంటి వాహకనౌకలు గల దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయిందని భారత నౌకాదళం తెలిపింది. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా ఈ నౌక నిర్మాణంతో మరో మెట్టును అధిరోహించిందని..భవిష్యత్తులో మరిన్ని నిర్మాణం కానున్నాయని నౌకాదళం తెలిపింది. ఈ వాహక నౌక 40 వేల టన్నుల బరువు, 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తు కలిగి ఉందని నేవీ పేర్కొంది.

14 డెక్కులను కలిగిన ఈ నౌకలో ఐదు ఉప నిర్మాణాలు ఉన్నాయని తెలిపింది. సుమారు 17వేల మంది సిబ్బంది కోసం రూపొందించారు. ఇందులో మహిళా అధికారులకు అన్ని వసతులతో కూడిన క్యాబిన్‌లతో పాటు 2,300 కంపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. 

మిషనరీ ఆపరేషన్‌, షిప్‌ నావిగేషన్‌కు అత్యాధునిక యంత్రాలను వినియోగించారని, సుమారు 28 నాట్‌ల గరిష్ట వేగం (గంటకు సుమారు 52 కి.మీ) 18 నాట్‌ల క్రూజింగ్‌ వేగం (గంటకు సుమారు 33.37 కి.మీ), 7,500 నాటికల్‌ మైల్స్‌ ( సుమారు 13,900 కి.మీ) కలిగి ఉందని నేవీ తెలిపింది. 24 మిగ్‌ 29 కె యుద్ధవిమనాలు పనిచేయనున్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

అత్యాధునిక విమాన వాహక నౌకలను రూపొందించడానికి, నిర్మించడానికి సముచిత సామర్థ్యం కలిగిన, ఎంపిక చేసిన దేశాల్లో భారత్‌ చేరిందని, కరోనా సవాళ్లు ఉన్నప్పటికీ.. ఈ మైలు రాయిని చేరకోవడం సాధ్యమైందని నేవీ పేర్కొంది. భారత్‌ గర్వించదగిన క్షణమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

దక్షిణ చైనా సముద్రంలోకి భారత్ యుద్ధ నౌకలు 

మరోవంక,  దక్షిణ చైనా సముద్రంలోకి ఈ నెల నౌకాదళాలను పంపనున్నట్లు భారత నేవీ పేర్కొంది. ఆగ్నేయాసియా, దక్షిణ చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాలకు గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ (అణ్వాయుధాలను ధ్వసం చేసే పరికరం) క్షిపణి యుద్ధనౌకతో పాటు నాలుగు నౌకలను రెండు నెలల పాటు మోహరించనున్నట్లు నేవీ తెలిపింది. 

స్నేహపూర్వక దేశాల మధ్య భద్రతా సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ చర్య చేపట్టినట్లు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. నౌకలను తరలించడంతో పాటు సముద్ర ప్రాంతాల్లో కార్యాచరణను చేపట్టడంతో భారత్‌ తన శాంతియుత ఉనికిని, స్నేహపూర్వక దేశాల మధ్య సంఘీభావాన్ని తెలుపుతుందని పేర్కొంది. 

సాధారణ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది జూన్‌లో యుఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌కు చెందిన అమెరికా ఎయిర్‌ క్రాఫ్ట్‌ కారియర్‌ గ్రూప్‌ దక్షిణ చైనా సముద్రాల్లోకి ప్రవేశించింది. అలాగే బ్రిటీష్‌ కారియర్‌ గ్రూప్‌ ఈ నెలలో పిలిఫ్పైన్స్‌ సముద్రంలో నావికా విన్యాసాలు చేయాల్సి వుంది. 

తమ విస్తరణలో భాగంగా భారత నౌకలు గువామ్‌ తీరంలో అమెరికా, జపాన్‌, అస్ట్రేలియా పాల్గొనే వార్షిక ఉమ్మడి యుద్ధనౌకల్లో పాల్గొంటాయని నౌకాదళం పేర్కొంది. సముద్ర ప్రాంత ప్రయోజనాలు, సముద్రంలో నేవిగేషన్‌ స్వేచ్ఛపట్ల నిబద్ధత ఆధారంగా భారత నావికా దళం చేపట్టనున్న ఈ కార్యకలాపాలు స్నేహపూర్వక దేశాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరుస్తాయని నేవీ తెలిపింది.