కర్ణాటకలో 2 లక్షల మంది విదేశీయుల మకాం

కర్ణాటకలో అధికారికంగానో, అక్రమంగానో దాదాపు 2లక్షల మంది విదేశీయులు మకాం వేసినట్టు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యేకించి అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి వారిని సరిహద్దులు దాటించాలని 2017లోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక జాబితాను కూడా సిద్ధం చేసి కేంద్ర హోంశాఖకు పంపింది. 

వివిధ దేశాల దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని హోంశాఖ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయలేదు. అప్పటి నుంచి ఇది పెండింగ్‌లోనే ఉందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియాలు ఒక కుదుపు కుదిపిన సమయంలోనూ విదేశీయుల పాత్ర అందులోనూ ఆఫ్రికా నివాసుల వ్యవహారంపై పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. 

ఆఫ్రికా వాసులు డ్రగ్‌ పెడ్లర్‌లుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. అడపా దడపా చాలా మందిని అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. గత ఏడాది కాలంలోనే 96 మంది ఆఫ్రికా దేశస్తులను మాదకద్రవ్యాల కేసుల్లో అరెస్టు చేసి జైళ్లకు తరలించినట్టు అధికారులు అంటున్నారు. 

తాజాగా,  కాంగో జాతీయుడు 27 ఏళ్ల జోన్ అలియాస్ జోయెల్ షిందాని మాలు మృతి చెందడం బెంగుళూరులో ఎక్కువగా ఉంటున్న విదేశీయులపై మరోసారి దృష్టి సారించేటట్లు చేస్తున్నది. నిరసన వ్యక్తం చేస్తున్న ఆఫ్రికన్ జాతీయులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కర్ణాటకలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీ పౌరులను గుర్తించడానికి, వారిని వారి దేశాలకు బహిష్కరించేందుకు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ (జైలు, పౌర రక్షణ, సహాయక సేవలు) నేతృత్వంలో ఒక కమిటీని గత నెలలో ఏర్పాటు చేసింది.

ఇంతలో, బెంగళూరు నగరంలోని భూస్వాముల ద్వారా అద్దెదారుల ధృవీకరణ కోసం నగర పోలీసులు మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. “ఈ పక్రియ విదేశీ పౌరులకు మాత్రమే పరిమితం కాదు. యాప్‌లో భూస్వాములు అందరు అద్దెదారుల  పాస్‌పోర్ట్, వీసా వివరాలను అప్‌లోడ్ చేయాలని భావిస్తున్నందున, ఇది చట్టవిరుద్ధంగా విదేశీ జాతీయుల సమస్యను కూడా పరిష్కరిస్తుంది. చాలా విదేశాలు, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలలో ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి” అని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.

వ్యాపార, విద్య, టూరిస్టు వీసాలపై రాజధానికి విచ్చేసిన పలు ఆఫ్రికా దేశాల వాసులు వీటి గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేసినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ప్రత్యేకించి బెంగళూరు నగరంలోని కొత్తనూరు, హెణ్ణూరు, నాగవార, లింగరాజపుర, బాగలూరు, బాగలకుంటె, తదితర ప్రాంతాలలో ఆఫ్రికా దేశాలకు చెందినవారు అధికసంఖ్యలో నివసిస్తున్నారు.

ఉగాండా, కెన్యా, నైజీరియా, ఘనా, సూడాన్‌, కాంగో, మొజాంబిక్‌, దక్షిణాఫ్రికా దేశాలకు చెందినవారు అధికంగా ఉన్నారు. విద్యాభ్యాసం కోసం వచ్చిన ఆఫ్రికా యువత డబ్బు కోసం వ్యసనాల బారినపడుతున్నట్టు గుర్తించామని పోలీసు అధికారులు అంటున్నారు. అనంతరం విలాసాల కోసం రకరకాల మాదకద్రవ్యాలను నగర ప్రజలకు విక్రయిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కొన్నిచోట్ల ఆఫ్రికా దేశస్తులు వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.

నగరంలో పదే పదే ఆఫ్రికన్‌ దేశస్తుల అట్టహాసంపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలయ్యాయన్నారు. నగరంలో స్థిరపడిన ఆఫ్రికా వాసులలో కనీసం 20 శాతం మంది మాదక ద్రవ్యాల ముఠాలతో సంబంధా లు కలిగినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. తాజాగా కాంగో దేశ నివాసి వద్ద కూడా మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయన్నారు. పోలీసులు వెంబడించి పట్టుకునే సమయంలోనే అతను పారిపోతూ కిందపడ్డాడని, ఆపై ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్టు తేలిందన్నారు.

రాజధానిలో ఆఫ్రికా దేశాలకు చెందిన అనేక మంది వీసాల గడువు ముగిసినప్పటికీ తిష్ట వేసినట్టు ఫిర్యాదులు వస్తుండడంతో పోలీసులు తాజాగా కూపీ లాగే ప్రయత్నాల్లో ఉన్నారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా విదేశీయుల వివరాలను మరోమారు సేకరించాలని తీర్మానించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.