తనను తానే ప్రధానిగా ప్రకటించుకున్న మయన్మార్ సైనిక నియంత

మయన్మార్ దేశ ప్రధానమంత్రిగా సైనిక నాయకుడు తనకు తాను ప్రకటించుకున్నాడు. రెండేండ్ల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తామని జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ చెప్పాడు. సంక్షోభం ఎత్తివేసే దిశగా ఆగ్నేయాసియా దేశాలతో సహకరిస్తానని  టెలివిజన్ సందేశంలో వెల్లడించారు.

మయన్మార్‌లో ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌ సాన్‌ సూకి ప్రభుత్వంపై సైన్యం ఫిబ్రవరి 1 వ తేదీన అర్ధరాత్రి తిరుగుబాటు చేసింది. సూకీ సహా ఎందరో నాయకులను అదుపులోకి తీసుకొని నిర్బందంలో ఉంచారు. సైన్యంతో జరిగిన ఘర్షణలో దాదాపు వేయి మంది ప్రాణాలు విడిచారు. వందల సంఖ్యలో సూకీ మద్దతుదారులు గాయపడ్డారు.

అప్పటినుంచి దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ దేశ పరిపాలనను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. సైనిక తిరుగుబాటు జరిగిన ఆరు నెలల తర్వాత దేశంలో విధించిన ఎమర్జెన్సీని 2023 లో ఎత్తివేయనున్నట్లు హేలింగ్ ప్రకటించడం గమనార్హం. అనంతరమే దేశ పార్లమెంట్‌కు సాధారణ ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.

అసోసియేషన్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఏసియాన్‌) పంపిన ప్రత్యేక రాయబారితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హేలింగ్‌ చెప్పాడు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికల కోసం తాము తప్పనిసరిగా వాతావరణాన్ని సృష్టించాల్సి ఉన్నదని చెప్పాడు. దేశంలో బహుళ పార్టీ ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చాడు.

ఫిబ్రవరి ఒకటో తేదీ తిరుగుబాటు అనంతరం ఆంగ్‌ సాన్‌ సూకీపై సైనిక పాలన అనేక ఆరోపణలు చేసింది. వాకీ-టాకీ రేడియోను చట్టవిరుద్ధంగా కలిగి ఉన్నందుకు, కరోనా వైరస్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు ఆమెపై కోర్టు విచారణ జరుగనున్నది. అనేక కేసుల్లో ఇరికించడం ద్వారా రాజకీయాల నుంచి సూకీని దూరంగా ఉంచాలని సైన్యం భావిస్తుందని మయన్మార్ ప్రజలు నమ్ముతున్నారు.