కరోనా పుట్టిల్లు వుహాన్‌లో డెల్టా పాగా

చైనాలో కరోనా డెల్టా వేరియంట్ కోరలు చాస్తోంది. దీంతో  కొన్ని లక్షల మంది ఇళ్లలకే పరిమితం కావలసి వచ్చింది. కరోనాకు పుట్టిల్లుగా అపవాదు పడిన వుహాన్‌లో ఏడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. స్థానికంగా సోమవారం 55 కేసులు వెలుగు లోకి వచ్చాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దాదాపు 12 ప్రావిన్స్‌ల్లో 20 నగరాల్లో డెల్టా వేరియంట్ విస్తరించింది.

వుహాన్‌లో ఏడు కేసులు కూడా వలసవాదులవని గుర్తించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బీజింగ్‌తో సహా ప్రధాన నగరాల్లో లక్షలాది మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. క్వారంటైన్‌లో ఉంటున్నారు. హునాన్ ప్రావిన్స్‌లో ఝుఝోవొ నగరంలో 1.2 మిలియన్ మంది మరో మూడు రోజుల పాటు కఠిన మైన లాక్‌డౌన్ చట్రంలో ఉండవలసి వస్తోంది.

పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఝుఝోవొ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా వైరస్ వ్యాప్తికి నాన్‌జింగ్ నగరంతో సంబంధమే కారణంగా చెబుతున్నారు. ఆ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో తొమ్మిది మంది క్లీనర్లకు జులై 20 న పాజిటివ్ కనిపించింది. దీంతో గత రెండు వారాలుగా 360 కి పైగా కేసులు నమోదయ్యాయి.

పర్యాటక ప్రాంతం ఝాంగ్ జియాజీ గత నెలలో వైరస్ చెలరేగి దేశంలో కరోనా కేసులు పెరగడానికి దారి తీసింది. ఈలోగా బీజింగ్‌లో టూరిస్టులను ఎవరినీ అనుమతించడం లేదు. అత్యవసర పనులపై వచ్చిన వారినే పరీక్షించి అనుమతిస్తున్నారు. బీజింగ్‌లో ఉంటున్న వారు ఎంతో అవసరమైతే కానీ బీజింగ్‌ను విడిచి వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతవారం చాంగ్‌పింగ్ జిల్లా కేంద్రంలో 9 గృహసముదాయాల్లో 41,000 మందిని లాక్‌డౌన్‌లో దిగ్బంధించారు.