భారత్‌, చైనా సరిహద్దుల్లో మరో మిలిటరీ హాట్‌లైన్‌

భారత్‌, చైనా సరిహద్దుల్లో మరో మిలిటరీ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతం వెంబడి విశ్వాసం, స్నేహపూర్వక సంబంధాల స్ఫూర్తిని మరింతగా పెంచడానికి సిక్కింలోని కాంగ్రా లా వద్ద భారత సైన్యం, టిబెట్‌ ప్రాంతంలోని ఖంబా డ్జోంగ్‌ వద్ద పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఎ) తాజా హాట్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రారంభోత్సవానికి ఇరు దేశాల సైన్యాల గ్రౌండ్‌ కమాండర్లు హాజరై స్నేహం-సామరస్యానికి సంబంధించిన సందేశాలను మార్పిడి చేసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 1న పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు లడఖ్‌ ప్రాంతంలో ఇప్పటికే ఇరు దేశాలకు రెండు హాట్‌లైన్‌లు ఉన్నాయి.

ఒక పాయింట్‌ నుంచి మరో పాయింట్‌కు కమ్యూనికేషన్‌ లింక్‌నే హాట్‌లైన్‌ అంటారు. ఇది ముందుగానే పొందుపరచిన గమ్యాన్ని సెలక్టు చేసి బటన్‌ నొక్కగానే ఆటోమాటిక్‌గా ఫోన్‌ కనెక్టవుతుంది. ఇలా ఉండగా,  వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణను వేగవంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని భారత్, చైనా తాజాగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

లద్దాఖ్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరు దేశాల మధ్య శనివారం 12వ విడత సైనిక కమాండర్ల చర్చలు జరిగాయి. ఈ చర్చలకు సంబంధించి ఇరు దేశాలు సోమవారం ఓ సంయుక్త ప్రకటన చేశాయి. శనివారం జరిగిన సమావేశంలో ఇరు దేశాలు.. హాట్‌స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల్లో సైన్యాల ఉపసంహరణపై ప్రధానంగా చర్చించాయి.

ఈ విషయాలపై లోతుగా చర్చించామని ఇరు దేశాలూ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి బలగాల ఉపసంహరణను మరింత వేగవంతం చేసేందుకు భారత్, చైనా అంగీకరించాయి. పాంగాంగ్ సరస్సు వద్ద సైన్యాల ఉపసంహరణ తరువాత.. భారత్-చైనా చర్చల్లో ఇప్పటివరకూ చెప్పుకోదగిన పురోగతి ఏదీ కనిపించలేదు. దెప్సాంగ్, దెమ్చోక్‌ను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని భారత్ పట్టుబడుతుండగా చైనా అందుకు ససేమిరా అంటోంది. ఈ కారణంగానే చర్చల్లో పురోగతి లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.