ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే!

కల్తీ మద్యంపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కు పిడికిలి బిగించింది. కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఎవరైనా రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిస్తే వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించే ప్రతిపాదనకు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సవరించిన బిల్లు ముసాయిదా ఆమోదించారు. ఇందులో కల్తీ మద్యం కారణంగా మరణించినట్లయితే నిందితుడికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించవచ్చు. అలాగే, జరిమానా మొత్తాన్ని కూడా రూ.25 లక్షలకు పెంచారు.

అక్రమ మద్యం అమ్మకాలను పట్టుకోవడానికి వచ్చిన ఎక్సైజ్ బృందం లేదా ఇతర దర్యాప్తు బృందంపై దాడి చేసిన సందర్భంలో మూడేళ్ల వరకు శిక్ష విధించనున్నారు. కల్తీ మద్యం అమ్మకాలను నిరోధించేందుకే ఈ కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు.

తొలిసారి కల్తీ మద్యం విక్రయిస్తూ దొరికిన వారికి జీవిత ఖైదు విధిస్తారని, రెండోసారి లేదా ఇదే నేరాన్ని పునరావృతం చేయడం వల్ల నిందితుడికి మరణశిక్ష విధించవచ్చని వారు వెల్లడించారు. ఇదే సమయంలో మద్యంలో కల్తీకి జరిమానా మొత్తాన్ని రూ.30,000 నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో కల్తీపై రూ.300 నుంచి రూ.2,000 వరకు నామమాత్రపు జరిమానా ఉండేది.