విప‌క్షాలు పార్ల‌మెంట్‌ను అవ‌మానిస్తున్నాయి

విప‌క్ష పార్టీలు పార్ల‌మెంట్‌ ను అవ‌మానిస్తున్న‌ట్లు ప్ర‌ధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇవాళ బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ మీటింగ్‌లో ఆయ‌న పాల్గొని, త‌మ పార్టీ ఎంపీల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశారు. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను విప‌క్షాలు అడ్డుకుంటున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. వాయిదా తీర్మానాల‌ను ఇస్తూ.. నినాదాల‌తో స‌భ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌తిప‌క్షాలు ఆటంకం క‌లిగిస్తున్నాయ‌ని, ఇది పార్ల‌మెంట్‌కు అవ‌మానం అని, రాజ్యాంగానికి, ప్ర‌జాస్వామ్యానికి, ప్ర‌జ‌ల‌కు ఇది అవ‌మానం అని విమర్శించారు.

రెండు స‌భ‌ల్లోనూ ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అభ్యంత‌ర‌కర రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఓ ఎంపీ మంత్రి చేతుల్లో నుంచి పేప‌ర్లు లాగేసి .. ఆ పేప‌ర్‌ను ముక్క‌లు చేసి స‌భ‌లో విసిరేసిన తీరును ప్ర‌ధాని ఖండించారు.  ఇటీవ‌ల పెగాస‌స్ వ్య‌వ‌హారంపై మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ మాట్లాడుతున్న స‌మ‌యంలో తృణ‌మూల్ ఎంపీ శాంత‌ను సేన్ మంత్రి చేతుల్లోంచి పేప‌ర్ లాగేసి చింపిన విష‌యం తెలిసిందే.

పార్ల‌మెంట్‌లో బిల్లులు ఆమోదం పొందుతున్న తీరుపై తృణ‌మూల్ ఎంపీ డెరిక్ ఒబ్రాయిన్ చేసిన కామెంట్‌ను కూడా మోదీ త‌ప్పుప‌ట్టారు. బిల్లుల‌ను ఆమోదిస్తున్నారా లేక పాపిడి చాట్ చేస్తున్నారా అని ఒబ్రెయిన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌కంగా ఉన్న‌ట్లు మోదీ త‌మ పార్టీ ఎంపీల‌తో జ‌రిగిన భేటీలో తెలిపారు.

విపక్షాలు ఎంత గందరగోళం చేసినా పార్టీ ఎంపీలు మాత్రం సంయమనం పాటించాలని, సభా గౌరవాన్ని కాపాడాలని బీజేపీ ఎంపీలకు ఆయన సూచించారు. మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఎవరూ సంయమనం కోల్పోవద్దని కోరారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ అవివరాలను మీడియాకు తెలియజేస్తూ, సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న విపక్షాలపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

కాగా, మంగళవారం సైతం పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు వివిధ అంశాలను లేవనెత్తుతూ సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. కాంగ్రెస్, టీఎంసీ, బీఎస్‌పీ, సాద్‌ ఎంపీలు పెగాసస్ స్పైవేర్, రైతు బిల్లులపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.

పార్ల‌మెంట్‌కు విప‌క్షాల సైకిల్ యాత్ర

మరోవంక,  లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌కు చెందిన విప‌క్ష పార్టీల నేతలు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివ‌సేన‌, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేర‌ళ కాంగ్రెస్‌, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, లోక‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ పార్టీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లు హాజ‌ర‌య్యారు.

బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావ‌జాలానికి వ్య‌తిరేకంగా మ‌నం అంతా క‌లిసి పోరాడాల‌ని రాహుల్ అన్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మ‌న స్వ‌రం వినిపిస్తే, మ‌న స్వ‌రం అంత బ‌లంగా మారుతుంద‌ని కాంగ్రెస్ నేత తెలిపారు. విప‌క్ష పార్టీ నేత‌ల‌తో బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన త‌ర్వాత‌.. రాహుల్ గాంధీ పార్ల‌మెంట్‌కు సైకిల్ యాత్ర చేప‌ట్టారు. ఆ ర్యాలీలో విప‌క్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు.