జగన్‌ ప్రభుత్వ ఆర్థిక అక్రమాలపై కేంద్రం కన్నెర్ర

రాజ్యాంగానికి విరుద్ధంగా తమ కళ్లుగప్పి.. దొడ్డిదారిలో అప్పులు తేవడమే లక్ష్యంగా   ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్డిసి)పై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యకలాపాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని స్పష్టం చేసింది.

దీనికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, సదరు ఉల్లంఘనలకు జవాబివ్వాలని రాష్ట్రానికి లేఖాస్త్రం సంధించింది. ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చి  పథకాలు అమలు చేసున్నామని సర్కారు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. దీనికోసం ప్రభుత్వ శాఖల ఆస్తులను ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేయాలని నిర్ణయించారు.

అలాగే మద్యంపై అదనపు ఎక్సైజ్‌ రిటైల్‌ పన్ను విధించి, దానిని ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేస్తున్నారు. ‘అవును మద్యంపై అదనపు పన్ను విధించి… దానిని హామీగా చూపించి అప్పులు తెస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది.  రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన భవిష్యత్‌ పన్ను ఆదాయాన్ని అప్పుల కోసం ఎస్‌డీసీకి ఎస్ర్కో చేయడం.. రాజ్యాంగంలోని 266(1)వ అఽధికరణకు విరుద్ధమని కేంద్రం తేల్చిచెప్పింది.

ఆ కార్పొరేషన్‌ నుంచి రూ.18,500 కోట్ల రుణం తీసుకురావడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఎస్‌డీసీ అక్రమ వ్యవహారాలు కేంద్రం దృష్టికి చేరేనాటికి రూ.18,500 కోట్ల రుణమే తెచ్చినప్పటికీ.. తాజాగా ప్రభుత్వం మరో రూ.3,000 కోట్ల అప్పు తెచ్చింది. దీంతో ఆ కార్పొరేషన్‌ నుంచి అక్రమంగా తెచ్చిన మొత్తం రుణం రూ.21,500 కోట్లకు చేరుకుంది.

పైగా బ్యాంకుల నుంచి ఈ కార్పొరేషన్‌కు రుణాలు తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను సదరు కార్పొరేషన్‌ పేరిట బదిలీ చేసి వాటిని బ్యాంకులకు తాకట్టు పెట్టడాన్నీ కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ఇలా కలెక్టరేట్‌, తహశీల్దార్‌ కార్యాలయాలను, విశాఖలోని 213 ఎకరాలను రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు బదిలీ చేసిన తర్వాతే ఆ రూ.3,000 కోట్లను బ్యాంకులు రాష్ట్రానికి విడుదల చేయడం గమనార్హం.

రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడేందుకు కేంద్రం రూపొందించిన ద్రవ్య నియంత్రణ-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని జగన్‌ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉల్లంఘిస్తోంది. కార్పొరేషన్లకు ఎడాపెడా గ్యారంటీలు ఇస్తూ వేల కోట్ల రుణాలు తెస్తూ.. వాటిని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో చూపకుండా కేంద్రం, ఆర్‌బీఐల కళ్లకు గంతలు కడుతోంది.

అయితే, ఇటీవలే ఈ ఎఫ్‌ఆర్‌బీఎం ఉల్లంఘనలను కేంద్రం కూడా గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన అప్పుల పరిమితిలో రూ.18 వేల కోట్లకు కోత విధించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు చేయడం, లెక్కా పత్రం లేకుండా ఎడాపెడా గ్యారెంటీలు ఇచ్చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజా లేఖలో పేర్కొంది. దీనిపైనా స్పందించాలని సూచించింది.

ఏపీఎస్డిసీ గుట్టు జాతీయ స్థాయిలో రట్టవడంతో జగన్‌ సర్కారు కొత్త అప్పుల కోసం ‘ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరు’తో కొత్త కంపెనీని రాష్ట్ర ఆర్థిక శాఖ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కి చెందిన హైదరాబాద్‌ బ్రాంచ్‌లో నమోదు చేసింది. దీనిని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎ్‌ఫసీ)గా, నాన్‌ డిపాజిట్‌ టేకింగ్‌ విభాగం కింద ఆర్‌బీఐ నమోదు చేసుకుంది.

అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదు. కానీ గడచిన నెల రోజుల్లోనే రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, బోర్డులు, యూనివర్సిటీలు, కొన్ని కార్పొరేషన్ల నుంచి 5 శాతం వడ్డీకి రూ.3,000 కోట్ల డిపాజిట్లను ఈ కంపెనీ స్వీకరించింది. అప్పుల పరిమితిని తప్పించుకోవడానికి ఇదొక ఎత్తుగడ.