పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి,  స్వదేశానికి చేరుకున్న తెలుగు తేజం పివి సింధును కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సింధు కాంస్యం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆమె కోచ్‌ పార్క్‌ తై సేంగ్‌ను కూడా ఘనంగా సత్కరించింది. 
 
ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ  పీవీ సింధు భారతదేశపు గొప్ప ఒలింపియన్లలో ఒకరనిప్రశంసించారు.  భారత ఐకాన్ అని కొనియాడారు. దేశం కోసం ఆడాల‌నే ప్ర‌తీ భార‌తీయుడికి సింధూ ఒక ప్రేర‌ణ‌గా నిలిచార‌ని పేర్కొన్నారు.  వ‌రుస ఒలింపిక్స్ గేమ్స్‌లో రెండు ప‌త‌కాలు సాధించి అథ్లెట్స్‌కు స్ఫూర్తిగా నిలిచార‌ని చెప్పారు.
ఒలింపిక్ క్రీడలు లక్ష్యంగా మన ఒలింపిక్ ఆశావహులు భారత్ ప్రభుత్వం ప్రోత్సహించడం మంచి ఫలితాలు ఇచ్చిన్నట్లు ఆమె విజయం చూపుతుందని మంత్రి తెలిపారు.  టోక్యో ఒలింపిక్స్‌కు బయలుదేరడానికి ముందు, ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సంభాషించారని, ఆమె విజయం సాధించిన వెంటనే ప్రధాని ఆమెను అభినందించారని గుర్తు చేశారు.
ఆమె అద్భుతమైన ప్రదర్శనతో 130 కోట్ల మంది భారతీయులు పులకించిపోయారని ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తాను
సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయినందుకు నిరాశకు గురైనప్పటికీ, వరుసగా రెండో ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించినందుకు సంతోషంగా ఉందని సింధు చెప్పారు.
“నా అభిమానులు ప్రతిఒక్కరికీ మద్దతు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము స్టేడియంలో అభిమానులు లేకుండా ఆడాము, కానీ భారతదేశం నుండి నాకు కోట్లాది మంది మద్దతు ఇచ్చారని, ఈ విజయం వారి కోరికల ఫలితమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు.
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ, సింధు గొప్ప క్రీడాకారిణి అని, ఆమె తనను తాను పదేపదే నిరూపించుకుందని అభినందించారు. “ఆమె విజయానికి దోహదం చేసింది గచ్చిబౌలిలో ఏర్పర్చిన ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాలు, గొప్ప కోచ్, కుటుంబ మద్దతు,  సింధు సొంత పట్టుదల, అభిలాష ఆమె రాణించడానికి దోహదపడ్డాయి” అని తెలిపారు. “ఇది భారతీయులందరూ సంపూర్ణ స్ఫూర్తి,  ప్రేరణను పొందగల రోజు. రాబోయే తరాలకు ఆమె ఎంతో స్ఫూర్తి, ప్రేరణగా ఉంటుంది” అని ఆమె  శాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్ క్రీడలలో పివి సింధు సాధించిన విజయాల వెనుక ఆమె పట్టుదలతో ఈ క్రీడాపట్ల దృష్టి కేంద్రీకరించి నిత్యం చేసే అభ్యాసాలు, అందుకోసం వ్యక్తిగత జీవితంలో త్యాగాలు, అర్ధరాత్రి వరకు ఈ క్రీడపైననే ఆసక్తి పెంచుకోవడం ఉన్నాయని చెప్పారు. “ఒక తెలుగు, ఒక తెలుగు బిడ్డ, హైదరాబాదీ ఈ విజయం సాధించడం నా హృదయాన్ని గర్వంతో నింపుతుంది. సింధు విజయం కేవలం 65 లక్షల మంది హైదరాబాదీలకు లేదా 6.5 కోట్ల తెలుగువారికి  మాత్రమే కాకుండా 65 కోట్ల మంది భారతీయ మహిళలు, బాలికలకు స్ఫూర్తినిస్తుంది” అని కొనియాడారు. .
ఈ కార్యక్రమంలో ప్రాణిక్ మాట్లాడుతూ, “పివి సింధు వరుసగా 2 వ ఒలింపిక్ పతకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించినందుకు ప్రశంసలు. ఆమె అంకితభావం, చిత్తశుద్ధి, వినయం మరియు క్రీడా స్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశం గర్వించదగినది. మీరు”.

అధికారిక ప్రకటన ప్రకారం, గత ఒలింపిక్ చక్రంలో ప్రభుత్వం సింధుకు దాదాపు రూ 4 కోట్ల నిధులను సమకూర్చింది.  హైదరాబాద్‌లోని శిక్షణా శిబిరాలతో పాటు 52 అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు ప్రయాణంతో సహా ఈ నిధులు తోడ్పడ్డాయి. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో, ఒలింపిక్ క్రీడలకు ముందు గచ్చిబౌలి స్టేడియంలో ఆమె శిక్షణను సులభతరం చేసింది.

అంతకుముందు టోక్యో నుంచి భారత్ కు చేరుకున్న ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, విమానాశ్రయ అధికారులు, క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అకాడమీ అధికారులు పీవీ సింధుకు ఘనంగా స్వాగతం పలికారు.
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఇంతవరకూ బ్యాడ్మింటన్‌ క్రీడలో భారత్ నుంచి పురుషులు కానీ మహిళలు కానీ ఆ ఘనత సాధించలేదు.