జగన్ ప్రభుత్వంపై ఐపీఎస్ ఎబివి న్యాయపోరాటం!

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాడినప్పటి నుండి గత రెండేళ్లుగా తనకు ఏ పోస్ట్ ఇవ్వకుండా, కనీసం జీతం కూడా చెల్లించకుండా, ఉన్నత న్యాయస్థానాల ఉత్తరువులను కూడా ఖాతరు చేయకుండా వ్యవయారిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబివి న్యాయపోరాటానికి సిద్దపడిన్నట్లు తెలుస్తున్నది.

గత నెల 19న ఎంపీ విజయసాయిరెడ్డికి ఏబీవీ లీగల్ నోటీసులు ఇచ్చారు.  తప్పుడు ఫిర్యాదు చేసి ఇంటెలిజెన్స్ పోస్టు నుంచి తొలగించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డితో పాటు సాక్షి మీడియా, అప్పట్లో ఆ వ్యవహారాలు చూసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తితో సహా ఏడుగురికి పరువునష్టం నోటీసులిచ్చారు.

ఈ నోటీసుల ప్రభావంతోనే ఆయనను ఐపీఎస్ సర్వీస్ నుండి డిస్మిస్ చేయమని సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు భావిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయనపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. నిఘా పరికరాల కొనుగోలు ఆరోపణలతోపాటు కొందరు అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు.

ఆయన సస్పెన్షన్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. శాఖాపరమైన విచారణలో భాగంగా ఏబీ వెంకటేశ్వరరావు కొద్దిరోజుల క్రితం కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే ఆయన కేసులకు సంబంధించి ప్రజెంటింగ్‌ ఆఫీసర్‌ను కూడా నియమించారు. ఇంతలోనే ఆయన్ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇటువంటి బెదిరింపులకు లొంగనని ఆయన స్పష్టం చేస్తున్నారు.

మరొకొన్ని అంశాలపై వరుసగా ప్రభుత్వంలోని పెద్దలకు పరువునష్టం నోటీసులు ఇవ్వడానికి సిద్దపడిన్నట్లు సంకేతం ఇస్తున్నారు. తనపై విచారణ సమయంలో ప్రభుత్వం వాడిన ఫోర్జరీ పత్రాలకు సంబంధించి క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్దపడిన్నట్లు తెలుస్తున్నది. ఒకొక్క బాణంతో పోరాటం కొనసాగిస్తూ మరో రఘురామకృష్ణంరాజు వలే జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.