బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు  బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్లమెంట్‌ సమావేశాల కారణంగా పాదయాత్ర వాయిదావేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ నెల 24 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సొంత నియోజకవర్గానికి కాకుండా ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లకు మొదటగా వెళ్లాలని కేంద్రమంత్రులకు కాషాయపార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి, విజయవాడ, భద్రాచలం పర్యటనకు కిషన్ రెడ్డి వెళ్లనున్నారు.

తెలంగాణకు రూ 38,114 కోట్ల ముద్రా రుణాలు 

కాగా,  ప్రధానమంత్రి ముద్ర యోజన (పిఎంఎంవై) పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేశామని, ఆ మొత్తం 47,26,819 ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ తెలిపారు.
పిఎంఎంవైలో భాగంగా శిశు, కిషోర్, తరుణ్ పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎన్ని ‘ముద్ర’ నిధులు మంజూరయ్యాయి? కేటగిరీల వారీగా పథకం ద్వారా లబ్ది పొందని లబ్దిదారుల వివరాలు, ఈ విషయంలో వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్  పార్లమెంట్‌లో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
2015 ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రారంభమైందని, నాటి నుండి నేటి వరకు దేశ వ్యాప్తంగా రూ.15.52 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.