‘‘ఎమ్మెల్యే సారూ రాజీనామా చేయి” టీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేల కలకలం

హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో అక్కడ ఎట్లాగైనా గెలుపొందాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు `దళిత్ బంధు’ వంటి భారీ పథకంతో పాటు అనేక వరాలను, వందల కోట్ల కొలది రూపాయల పధకాలను ఆ నియోజకవర్గంలో అత్యవసరంగా అమలు చేయబోవడం తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో టీఆర్‌ఎస్‌ ఎమ్యెల్యేలకు  కంటకప్రాయంగా మారింది. అక్కడ ఆ పార్టీకి చెందిన ఎమ్యెల్యే ఈటెల రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది. 

రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడ గెలుపుకోసం కేసీఆర్ భారీ పధకాలు చేబడుతున్నారు. అందుకనే `మీరు కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలు వస్తే మా నియోజకవర్గానికి కూడా నిధుల వర్షం కురుస్తోంది’ అంటూ రాజీనామా చేయమని రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ ఎమ్యెల్యేలపై వత్తిడులు పెరుగుతున్నాయి. ఆ మేరకు సోషల్ మీడియాలో డిమాండ్లు వైరల్ అవుతున్నాయి. దానితో ఎమ్యెల్యేలు తమ నియోజకవర్గంలో తిరగడానికే జంకుతున్నారు. 

రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తొలుత దీనిని హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.  ఇందుకోసం రూ.1500-రూ.2000 కోట్లు కేటాయిస్తామన్నారు. దీంతోపాటు ఆ నియోజకవర్గంలో రెండో విడత గొర్రెల పంపిణీ, దళిత కాలనీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం, కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు.

ఈ పధకాలు ఏవీ ఎన్నికల అనంతరం కొనసాగవని, మిగిలిన నియోజకవర్గాలలోకి రాబోవని అందరికి తెలిసిందే. అందుకనే ఎన్నికలు వస్తేనే తమకు పధకాలు వస్తాయని ప్రజలు సహితం వాపోతున్నారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌చెక్కుల పంపిణీ, కొత్త పెన్షన్లు, రేషన్‌కార్డుల జారీ వంటివీ వేగవంతమయ్యాయి.  

హుజూరాబాద్‌పై సర్కారు ఇలా ప్రత్యే క దృష్టి సారించడం.. రాష్ట్ర ప్రజలందరి చూపు ఆ నియోజకవర్గంపై పడేలా చేసింది. దీంతో తమ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలన్నా, పథకాలు అమలు కావాలన్నా.. ఉప ఎన్నిక రావాలన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగేటట్లు చేస్తున్నది. ఆ మేరకు మంత్రులు, ఎమ్యెల్యేలపై వత్తిడులు పెరుగుతున్నాయి. 

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ కూడా ‘‘ఎమ్మెల్యే గారూ రాజీనామా చేసి.. ఉప ఎన్నికకు సిద్ధపడండి! మన నియోజకవర్గానికి కూడా నిధులు వస్తాయి’’ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చాయి. గతంలో హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలకూ సీఎం కేసీఆర్‌ ఇలాగే నిధులు, హామీల వరద పారించారని గుర్తు చేస్తున్నాయి. పైగా, రాజీనామా చేస్తే వారిని తిరిగి గెలిపించే బాధ్యత తమది అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి . 

హుజూరాబాద్‌ పక్క నియోజకవర్గాల్లోనైతే ఇవి సెగలు పుట్టిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్‌లో జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో పలువు రు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడ ఆందోళనలు కూడా చేపడుతున్నారు. 

తాజాగా కరీంనగర్‌ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్‌ రాజీనామా చేయాలంటూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రేమ ఉంటే రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో దండేపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. 

మంత్రి హరీశ్‌రావుకూ ఈ తలనొప్పి తప్పలేదు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలని స్థానికంగా డిమాండ్లు చెలరేగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాజీనామా కోరుతూ ధర్నా చేపట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో.. ‘‘ఎమ్మెల్యే సారూ రాజీనామా చేయండి’’ అంటూ హోర్డింగ్‌లు వెలిశాయి.

దేవరకొం డ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ రాజీనామా చేయాలంటూ దళిత జేఏసీ నాయకులు ఇటీవల ఆందోళనకు దిగారు. సేవాలాల్‌ బంజార సంఘం విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న డిమాండ్‌ను సోషల్‌ మీడియాలో స్థానిక ప్రజలు వైరల్‌ చేస్తున్నారు.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ రాజీనామా చేయాలంటూ ఆదివారం దళిత సింహగర్జన పేరుతో దళిత, బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ రాజీనామా చేస్తే నియోజకవర్గాలు బాగుపడుతాయనే కామెంట్లతో కూడిన వీడియోలు ఆయా నియోజకవర్గాల్లో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా లో.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్యల రాజీనామా డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ రాజీనామా చేయాలంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పంపుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని స్థానిక బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే జి.సాయన్న రాజీనామా చేయాలంటూ కొందరు రూపొందించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.