హుజూరాబాద్ లో 16 నుంచి ద‌ళిత‌బంధు ప్రారంభం

ఈ నెల 16వ తేదీ నుంచి ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభం కానుంది. సీఎం కే చంద్రశేఖరరావు అధ్య‌క్ష‌త‌న ఆదివారం జ‌రిగిన రాష్ట్ర మంత్రివర్గ స‌మావేశం ఈ మేర‌కు నిర్ణ‌యించింది. ద‌ళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్ర‌భుత్వం హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ క్ర‌మంలో భాగంగా ద‌ళిత‌బంధుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ ప్ర‌త్యేక చ‌ట్టం తేవాల‌ని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప‌థ‌కంలో భాగంగా ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల సాయం అంద‌జేయ‌నుంది. ల‌బ్దిదారులు క‌లిసి పెద్ద యూనిట్‌ను పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని మంత్రివర్గం అభిప్రాయ‌ప‌డింది.

57 ఏళ్లకు పెన్షన్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6 లక్షల 62 వేల మంది కొత్త పెన్షనర్లు పెరగనున్నారు. కుటుంబంలో ఒక్కరికే  పింఛను పద్ధతిని కొనసాగించనున్నారు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేస్తారు. 

ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రూ.50 వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా మంజూరైన 7 మెడికల్‌ కాలేజీలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది.