ఈ-రూపీని ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోదీ

డిజిట‌ల్ పేమెంట్స్‌ను ప్రోత్స‌హించేందుకు .. ఎల‌క్ట్రానిక్ వోచ‌ర్ ఈ-రూపీ ని ప్ర‌ధాని మోదీ ఇవాళ ఆవిష్క‌రించారు. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా ఆయ‌న ఈరూపీ వోచ‌ర్‌ను రిలీజ్ చేశారు. డిజిట‌ల్ లావాదేవీలు, నేరుగా న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో దేశంలో ఈరూపీ కీల‌క‌పాత్ర పోషించనున్న‌ట్లు మోదీ తెలిపారు.

టార్గెట్ ప్ర‌కారం.. చాలా పార‌ద‌ర్శ‌కంగా, ఎటువంటి లీకేజీ లేకుండా న‌గ‌దును డెలివ‌రీ చేయ‌వ‌చ్చు అని మోదీ చెప్పారు. అత్యాధునిక టెక్నాల‌జీ సాయంతో 21వ శ‌తాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చు అని ఆయ‌న పేర్కొన్నారు.  క్యూర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఈ వోచ‌ర్‌ను పంపిస్తారు. ల‌బ్ధిదారుల మొబైల్‌కు ఆ వోచ‌ర్‌ను డెలివ‌రీ చేస్తారు. దాని ద్వారా అమౌంట్‌ను వాడుకోవ‌చ్చు. బ్యాంక్‌ ఖాతాలు, కార్డులు, యాప్‌లతో సంబంధం లేకుండా వినియోగదారుడు లావాదేవీలు జరుపవచ్చు.

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.

 ఈ-రూపీ విధానంలో వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి.  దీనిలో మరో ప్రయోజనం ఏంటంటే కార్డు, పేమెంట్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

ఇ-రూపిని తల్లి, శిశు సంక్షేమ పథకాలు, టిబి నిర్మూలన కార్యక్రమాలు, మందులు,  రోగ నిర్ధారణ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన వంటి పథకాల కింద మందులు, పోషకాహార మద్దతు అందించే పథకాల కింద సేవలను అందించడానికి ఉపయోగించవచ్చని ప్రధాన మంత్రి కార్యాలయం ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.

అదే విధంగా ఎరువుల సబ్సిడీలు వంటి వాటికి కూడా ఉపయోగించవచ్చు. ప్రైవేట్ రంగం కూడా తమ ఉద్యోగుల సంక్షేమం,కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా ఈ డిజిటల్ వోచర్‌లను ప్రభావితం చేయగలదని ఇది జోడించింది.