చిన్న, చిన్న పార్టీలతో చిక్కులు ఎదుర్కొంటున్న అఖిలేష్

కరోనా రెండో వేవ్ ను కట్టడి చేయడంలో ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలం అయిన్నట్లు ఒకేసారి జాతీయ మీడియాలో వరుసగా కధనాలు వస్తుండంతో వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తాను గెలుపొంది, మరోమారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లో ఆశలు చిగురించాయి.

అందుకనే అందరికన్నా ముందుగానే, నెలరోజులపాటు కరోనాతో పడక వేసినా, ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రగిల్చే ప్రయత్నం చేశారు. ఈ హడావుడిలో బిజెపి జాతీయ నాయకత్వం కూడా అప్రమత్తమై లక్నోకు వరుసగా సీనియర్ నేతలను పంపింది. దానితో బలమైన నేతగా ఎదిగిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను గద్దె దింపబోతున్నట్లు ఊహాగానాలు వ్యాపించాయి.

అయితే బిజెపి జాతీయ నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి, బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలతో సమీక్షలు జరిపి ప్రభుత్వ పనితీరును మెచ్చుకొన్నారు. అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే వచ్చే ఏడాది ఎన్నికలకు వెడుతున్నామని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించిన కొన్ని పోల్ సర్వేలలో ఇప్పటికి ప్రజాదరణతో ఆదిత్యనాథ్ ను ఎదురుకొనే నేతలేరని స్పష్టం అవుతున్నది. ప్రజల మద్దతుతో కూడా బిజెపి ముందంజలో ఉన్నట్లు వెల్లడి అవుతున్నది.

దానితో అఖిలేష్ ఆశలు క్రమంగా ఆవిరికావడం ప్రారంభించాయి. మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఇప్పుడు పొత్తులకు అన్వేషణ ప్రారంభించారు. గతంలో ఒక సారి కాంగ్రెస్, మరోసారి బిఎస్పీతో పొత్తు ఏర్పాటు చేసుకొని చేతులు కాల్చుకున్న అఖిలేష్ ఇప్పుడు ఆ   పార్టీల వెంట మరోమారు వెళ్లే సాహసం చేయడం లేదు.

పైగా ఆ రెండు పార్టీలు సహితం కొద్దిపాటి నియోజకవర్గాలకు ఇప్పుడు పరిమితం అయిన్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా అవి చెప్పుకోదగిన ప్రభావం చూపే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకనే అఖిలేష్ ఇప్పుడు చిన్న, చిన్న పార్టీలతో పొత్తుకోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

‘2022 ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తు కోసం మా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో చిన్న పార్టీలు మాతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చాయి. ఇంకొన్ని ముందుకొచ్చే అవకాశాలున్నాయి’ అని ఆయన ప్రకటించారు. అయితే ఆ పార్టీల నేతలు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ఉండడంతో వారిని దారిలోకి తెచ్చుకోవడంపై ఇరకాటంలో పడుతున్నారు. ఉదాహరణకు, ఆర్ఎల్డి జయంత్ చౌదరి పశ్చిమ యుపిలోని జాట్ బెల్ట్‌లో చాలా సీట్లు డిమాండ్ చేస్తున్నారు.

పార్టీ వాస్తవ బలం గురించి అతని తండ్రి అజిత్ సింగ్ కు వాస్తవికంగా ఉండేవారు. జయంత్ అడిగినన్ని సీట్లు ఇస్తే వాటన్నింటిని బీజేపీకి అప్పచెప్పిన్నట్లే కాగలదని అఖిలేష్ భయపడుతున్నారు.

అదేవిధంగా,  ఓం ప్రకాష్ రాజ్భర్, తూర్పు యుపిలో ఎన్నికల శక్తివంతమైన వెనుకబడిన ఉప-కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆయన పార్టీ కూడా ఎక్కువ సీట్లకు పట్టుబడుతున్నారు. ఇంతలో, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడా ఢిల్లీకి సమీపంలోని నగరాలలో గల  సీట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అఖిలేష్ కష్టాలను మరింత పెంచడానికి, అనారోగ్యంతో ఉన్న అతని తండ్రి ములాయం సింగ్ యాదవ్, తన కూటమిలో చేరడానికి విడిపోయిన మామయ్య శివపాల్ యాదవ్‌ను ఆహ్వానించాలని పట్టుబడుతున్నారు.  శివపాల్ తన పార్టీని ఎస్పీలో విలీనం చేస్తేనే కలసి పనిచేసెడిది అని అఖిలేష్ స్పష్టం చేస్తున్నది. 2017 ఎన్నికలలో శివపాల్ `విద్రోహం’ కారణంగానే అధికారం కోల్పోయానని అఖిలేష్ బలంగా నమ్ముతున్నాడు.