ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ తో తొలి భార‌తీయ మ‌హిళ‌ సింధు

టోక్యో ఒలింపిక్స్ లో పివి సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా నిలిచింది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్జుకున్న సింధు రజతంతో సరిపెట్టుకుంది. 

టోక్యో  ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను దేశానికి తొలి పతకం అందించగా, సింధు రెండో పతకం అందించింది.  ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జ‌రిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వ‌రుస గేమ్స్‌లో గెలిచి కాంస్య ప‌త‌కం సాధించింది. ఈ సంద‌ర్భంగా త‌న సంతోషాన్ని మీడియాతో పంచుకుంది.

‘ఇన్నేండ్లుగా ప‌డుతున్న క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం న‌న్నుచాలా ఎమోష‌న్స్ వెంటాడుతున్నాయి. కాంస్య ప‌త‌కం గెలిచినందుకు సంతోషించాలో.. ఫైన‌ల్‌లో ఆడే అవ‌కాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధ‌ప‌డాలో అర్థం కావ‌డం లేదు’ అని పేర్కొన్నారు. 

రియో రజత పతకం కంటే టోక్యో కాంస్య పతకం గొప్పదని పేర్కొంది. కాంస్యం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చిందని చెప్పింది. 2016 రియో ఒలింపిక్స్‌లో తాను పతకం గెలుస్తానని ఎవరికీ పెద్దగా ఆశలు లేవు కాబట్టి తనపై ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడి విజయం సాధించానని వివరించింది. కానీ, ఈసారి తనపై బోల్డన్ని ఆశలు ఉండడం, పేవరెట్‌గా బరిలోకి దిగడంతో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపింది.

“ఏదేమైన‌ప్ప‌టికీ ఈ మ్యాచ్ ఆడే స‌మ‌యంలో నా భావోద్వేగాలు అన్నింటినీ ప‌క్క‌న‌పెట్టేసి.. నా శాయ‌శ‌క్తుల ఆడాను. ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి మెడ‌ల్ సాధించిపెట్టినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా” అంటూ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. త‌న‌పై ప్రేమాభిమానాలు చూపించిన అభిమానుల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పింది.

ఒలింపిక్స్‌లో గెల‌వ‌డం ప‌ట్ల చాలా సంతోషంగా ఉంద‌ని.. ఈ మ‌ధుర క్ష‌ణాల‌ను చాలా ఎంజాయి చేస్తున్నాన‌ని పీవీ సింధు తెలిపింది. త‌న గెలుపు కోసం కుటుంబ‌స‌భ్యులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని పేర్కొంది. అలాగే స్పాన్స‌ర్స్ కూడా ఎంత‌గానో ప్రోత్స‌హించార‌ని చెప్పింది. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ కృతజ్ఞ‌త‌లు తెలిపింది. 

ఇక ఇవాళ బ్రాంజ్ మెడ‌ల్ కోసం జ‌రిగిన పోటీ గురించి చెబుతూ.. నిన్న‌టి మ్యాచ్‌లో మేమిద్ద‌రం ( సింధు, హి బింగ్జియా ) ఇద్ద‌రం ఓడిపోయాం. మా ఇద్ద‌రికీ ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. దేశం కోసం మెడ‌ల్ గెల‌వాల్సిన బాధ్య‌త మాపైన ఉందని తెలిపారు. 

ఇలాంటి స‌మ‌యంలో పోరాడ‌టం అంత సులువు కాదు. చాలా పెద్ద విష‌యం. ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం కోసం చాలా ఓపిగ్గా ఉన్నా. ఆధిక్యంలో ఉన్న‌ప్ప‌టికీ విశ్ర‌మించ‌లేదు. అని చెప్పుకొచ్చింది. అలాగే 2024లో పారిస్‌లో జ‌ర‌గ‌బోయే ఒలింపిక్స్‌లోనూ క‌చ్చితంగా ప‌త‌కం సాధిస్తాన‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేసింది.

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర  మోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పీవీ సింధుని ప్రశంసించారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందిస్తూ భవిష్యత్‌ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.