41 ఏళ్ల త‌ర్వాత ఒలింపిక్స్ సెమీస్‌లోకి హాకీ టీం

ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ టీమ్ సంచ‌ల‌నం సృష్టించింది. 41 ఏళ్ల త‌ర్వాత ఒలింపిక్స్ సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టే ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3-1తో బ్రిటన్‌పై ఘన విజయం సాధించింది.

మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు బ్రిటన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. గోల్‌ చేయనీకుండా అడ్డుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో ఒక‌ప్పుడు 8 గోల్డ్ మెడ‌ల్స్ సాధించినా.. త‌ర్వాత క‌ళ త‌ప్పిన భార‌త హాకీ.. ఈసారి అద్భుత‌మే చేసింది. టోర్నీ మొత్తం నిల‌క‌డ‌గా రాణిస్తున్న మ‌న టీమ్‌.. లీగ్ స్టేజ్‌లో 5 మ్యాచ్‌ల‌కు గాను 4 గెలిచిన విష‌యం తెలిసిందే.  భారత్ త‌ర‌ఫున దిల్‌ప్రీత్ సింగ్‌, హార్దిక్ సింగ్‌, గుర్జిత్ సింగ్ గోల్స్ చేశారు.

మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ చేయగా.. రెండో క్వార్టర్‌లో 16వ నిమిషంలో గుర్జత్‌సింగ్‌ మరో గోల్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌ విరామ సమయానికి భారత్‌ 2-0 పాయింట్ల ఆధిక్యంతో కొనసాగింది. 45వ నిమిషంలో బ్రిటన్‌ తొలి గోల్‌ చేసింది. 

దీంతో మూడో క్వార్టర్‌ పూర్తయ్యేసరికి బ్రిటన్‌ ఒక గోల్‌ చేసి స్కోర్‌ 2-1గా మార్చింది. నాలుగో క్వార్టర్‌లో 57వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ మూడో గోల్‌ చేసి భారత్‌ జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. ఫలితంగా భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

1972 ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆ స్థాయి ప్రదర్శన మరెప్పుడూ కనబర్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్‌లో పునర్‌ వైభవాన్ని గుర్తు చేస్తూ మేటి జట్లను మట్టికరిపించి సెమీఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.