అస్సాంలో మరో కాంగ్రెస్ ఎమ్యెల్యే రాజీనామా!

అసోం కాంగ్రెస్‌ పార్టీలో మరో ఎమ్యెల్యే తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. రాష్ట్ర కమిటీ నిర్ణయాలపై ఎదురుతిరిగినందుకు  షోకాజ్ నోటీసు పంపిస్తే దానికి జవాబుగా ఏకంగా రాజీనామా లేఖను పంపి ఖంగుతినిపించారు. 
 
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రుప్‌జ్యోతి కూర్మి గత నెల 18న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఎగువ అసోంలోని థోవ్రా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సుశాంత బోర్గోహెయిన్ సహితం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ కి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు అసోం కాంగ్రెస్ చీఫ్ భూపెన్ బోరా తెలిపారు. అయితే ఆయనపై చట్టపరమైన చర్యల కోసం న్యాయ సలహా తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే సుశాంత బోర్గోహెయిన్ కు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వగా, అందుకు ప్రతిగా ఆయన తన రాజీనామాను పంపారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ నేతల నిర్ణయాలను ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్న ఆయన బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించారు. 
 
ఊహించినట్లే ఆయన బీజేపీ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతివ్వడం ప్రారంభించడంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఆలస్యంగానైనా ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వగా తాము పంపిన నోటీసుకు బోర్గోహెయిన్ రాజీనామా చేస్తున్నానంటూ సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ భూపెన్ బోరా వెల్లడించారు. 
 
కాంగ్రెస్ కు రాజీనామా ప్రకటించిన ఎమ్మెల్యే బోర్గోహెయిన్ ఆగస్టు 2న బీజేపీలో చేరే అవకాశం ఉంది. కోఖ్రాఝర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ అంశాన్ని ధృవీకరించారు. రాబోయే రోజుల్లో బోర్గోహెయిన్ బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికార బీజేపీ వైపు చూస్తున్నారు. అడపా దడపా ఫిరాయింపులు చోటుచేసుకుంటున్నాయి.