18 గంటలే జరిగిన పార్లమెంట్ సమావేశాలు 

పెగాసస్‌ గూఢచర్యం తదితర అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనతో వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు కేవలం 18 గంటల పాటే జరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం 107 గంటల పాటు సమావేశాలు జరుగాల్సి ఉంది. అందులో 17 శాతం వ్యవధిలో మాత్రమే కొనసాగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సమావేశాల సమయం 89 గంటలు వృథా కావడంతో రూ.133 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపాయి. జూలై 19న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 54 గంటలు పనిచేయాల్సిన లోక్‌సభ కేవలం ఏడు గంటలు.. రాజ్య‌స‌భ 53గంటలకు 11 గంటల స‌మ‌యం మాత్రమే ప‌ని చేశాయ‌ని అధికార వ‌ర్గాలు చెప్పాయి.

దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు, న్యాయ‌మూర్తులు, జ‌ర్న‌లిస్టుల‌తోపాటు మీడియా ప్ర‌తినిధుల, కొంద‌రు మంత్రుల ఫోన్లను పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాక్‌ చేశారని విపక్షాల‌ ఆరోప‌ణ‌. స‌మావేశాలు మొద‌లైన‌ప్ప‌టి నుంచి పెగాస‌స్ స్పైవేర్‌పై ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతున్నాయి.

అయితే అవన్నీ నిరాధార ఆరోపణలని, పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తోసిపుచ్చుతున్నది.  కరోనా వంటి అత్యవసర అంశాలపై ముందుగా చర్చించి, తగు  రూపంలో నోటీసు ఇస్తే ఆ అంశంపై కూడా చర్చకు సిద్ధం అని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. అయితే వెంటనే చర్చ జరగాలని పట్టుబడడంతో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. 

పైగా, సభ్యులు మంత్రులు, సభాపతులపై అధికారిక పత్రాలను చింపివేసి, విసరడం వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడడంతో గందరగోళం నెలకొన్నది. ఈ విషయమై రాజ్యసభలో టిఎంసి సభ్యులు ఒకరిని, లోక్ సభలో 10 మంది కాంగ్రెస్ సభ్యులను సమావేశాలు పూర్తయ్యేవరకు సభా బహిష్కరణ జరిగింది. కాగా, గందరగోళ మధ్యనే ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశ పెట్టి, చర్చ లేకుండా ఆమోదం పొందగలిగింది.