కేరళలో కరోనా కలకలం …. కేంద్ర బృందం పయనం

కేర‌ళ‌లో క‌రోనా వైర‌స్ కేసులు ఆందోళ‌న‌క‌రంగా పెరుగుతుండ‌టంతో ఆ రాష్ట్రానికి న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన నిపుణుల బృందాన్ని పంపాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ‌కు నిపుణుల బృందం స‌హ‌క‌రిస్తుంది. కొవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం  ప్రకటించింది. ఈ నెల 31, ఆగస్ట్‌ ఒకటో తేదీల్లో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

కేర‌ళ‌లో ప‌ది శాతం పైగా పాజిటివిటీ రేటు న‌మోద‌వుతున్న 12 జిల్లాల్లో కేంద్ర బృందం ప‌ర్య‌టించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.  ఇప్పుడు దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ ముందుకొచ్చింది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా, కేరళలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. 

గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ‌లో అత్య‌ధికంగా 22,056 తాజా కేసులు వెలుగుచూశాయి.దేశం మొత్తం న‌మోదైన కేసుల్లో ఇవి 50 శాతంపైగా ఉండ‌టం గ‌మ‌నార్హం. తాజా కేసుల‌తో కేర‌ళ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 33,27,301 కేసులు వెలుగుచూడ‌గా 16,457 మంది మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి మ‌ర‌ణించారు.

కేర‌ళ‌లో క‌రోనా ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు మ‌రిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాల‌ని కేర‌ళలో కొవిడ్‌పై ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీ స‌భ్యుడు డాక్ట‌ర్ అనీష్ డిమాండ్ చేశారు. సెరో స‌ర్వే ప్ర‌కారం కేర‌ళ‌లో 42 శాతం మందిలోనే ఇన్ఫెక్ష‌న్ వ్యాప్తి చెందిన‌ట్టు వెల్ల‌డైంద‌ని చెప్పారు. జాతీయ స‌గ‌టు కంటే కేర‌ళ‌లో అత్య‌ధిక జ‌నాభాకు వ్యాక్సినేష‌న్ చేప‌ట్టామ‌ని తెలిపారు.

వరుసగా రెండో రోజు కూడా 22 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలు డేటాను పరిశీలిస్తే.. ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ సంఖ్య మంగళవారం నాడు 22వేలు దాటగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,056 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా 131 మంది కన్నుమూశారు. 

కేర‌ళ‌లో క‌రోనా కేసులు అనూహ్యంగా పెర‌గ‌డం థ‌ర్డ్‌వేవ్ ప్రారంభానికి సంకేతంగా చూడాల‌ని మ‌హారాష్ట్ర హోంమంత్రి రాజేష్ తోప్ పేర్కొన్నారు. థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌రుస్తోంద‌ని చెప్పారు. థ‌ర్డ్‌వేవ్ త‌లెత్తితే క‌ట్ట‌డి చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా, ప్పటి వరకు దేశంలో 45కోట్లకుపైగా టీకాలు వేశామని, 18-44 ఏజ్‌గ్రూప్‌లో 15.38కోట్లకుపైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం రాత్రి 7 గంటల వరకు అందిన తాతాల్కిక సమాచారం మేరకు ఒకే రోజు 39,42,457 మోతాదులు వేసినట్లు చెప్పింది. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కోటికిపైగా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.