ప్రీక్వార్టర్స్‌లోకి అతాను దాస్‌, క్వార్టర్‌ ఫైనల్లోకి సింధు

ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల విజయాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం జరిగిన ఆయా మ్యాచుల్లో పీవీ సింధు, భారత హాకీ జట్టు గెలుపొందగా, ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ విజయం సాధించాడు. 

భారత ఆర్చర్‌ అతాను దాస్‌ ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన దక్షిణ కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం నమోదుచేశాడు. పురుషుల వ్యక్తిగత విభాగం 1/16 ఎలిమినేషన్స్‌లో దక్షిణ కొరియా ఆటగాడు ఓ జిన్‌ హయాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 5-6 తేడాతో గెలుపొందాడు. 

కాగా, మ్యాచ్‌ సమయం ముగిసే సరికి ఇరువురి స్కోర్లు సమం కావడంతో షూట్‌ ఆఫ్‌ నిర్వహించారు. ఇందులో అతాను దాస్‌ పైచేయి సాధించి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. దాస్‌ సతీమణి ఆర్చర్‌ దీపికా కుమారి ఇప్పటికే మహిళల వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. కాగా, అంతకుముందు జరిగిన ఎలిమినేషన్‌ మ్యాచ్‌లో చైనీస్ తైపీ ఆర్చర్ డెంగ్ యు చెంగ్‌పై 4-6 తేడాతో అతాను దాస్‌ విజయం సాధించాడు.

భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు ఒలింపిక్స్‌లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది. మహిళ సింగిల్స్‌ గ్రూప్‌-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం ఉదయం డెన్మార్క్‌ షెట్లర్‌ మియా బ్లిక్‌ఫెల్ట్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్‌లో వరుస గేమ్‌లలో 21-15, 21-13తో చిత్తుచేసింది. దీంతో వరుస విజయాలతో గ్రూప్‌-జేలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, క్వార్టర్‌ ఫైనల్‌లో గెలిస్తే కాంస్యం సాధించే అవకాశం ఉంది.

మరోవంక, పురుషుల హాకీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాను భారత జట్టు మట్టికరిపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. దీంతో గ్రూప్‌లో తానాడిన నాలుగు మ్యాచుల్లో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇక భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది.

ఒలింపిక్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ను భారత హాకీ జట్టు మట్టికరిపించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాపై భారత హాకీ జట్టు జయకేతనం ఎగురవేసింది. గురువారం ఉదయం జరిగిన గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది.