భారత్ – అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం

భారత్, అమెరికా మధ్య సంబంధాలతో పోలిస్తే ఇటువంటివి విశ్వవ్యాప్తంగా కొన్ని దేశాలకే పరిమితమైన‌వ‌ని పేర్కొంటూ భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అమెరికా విదేశాంగ విధానంలో అతి ప్రధానమైనదని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌ స్పష్టంచేశారు.  భార‌త్-అమెరికా దేశాల బంధం బ‌ల‌మైన‌ద‌ని తెలుపుతూ ప్ర‌పంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయ‌న భరోసా వ్యక్తం చేశారు.

ముఖ్యంగా స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్న బ్లింకెన్‌, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో భేటీ అయ్యారు. కొవిడ్‌-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే కార్యాచరణ, ఆఫ్ఘనిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారం పెంచుకోవ‌డంపై భారత నాయకత్వంతో బ్లింకెన్‌ చర్చించారు

కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం భారత దేశానికి అదనంగా 25 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం వల్ల భారత దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత పటిష్టమవుతుందని, తద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. 

‘ప్రాథమిక స్వేచ్ఛ, మానవ హక్కులను అమెరికా గౌరవిస్తుంది. మేం భారత్‌ను కూడా ఇదే కోణంలో చూస్తాం. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నది’ అని చెప్పారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతా బలగాల మోహరింపు అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు.  అలాగే ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులు, ఇండో-పసిఫిక్‌, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత పరిస్థితులపై కూడా సమాలోచనలు జరిపారు. 

ఇరు దేశాల మధ్య విస్తృత, బహుళ రంగ, పపంచ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య చర్చలు ప్రారంభమయ్యాయని.. ఈ సందర్భంగా ఆంటోనీ బ్లింకెన్‌, జైశంకర్‌ను స్వాగతిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ట్వీట్‌ చేశారు. ఇరు నేతల ఫొటోలను ఈ ట్వీట్‌కు జత చేశారు.
 
జైశంకర్‌తో భేటీకి ముందు బ్లింకెన్‌ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌తో సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులతోపాటు ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్లు సమాచారం. అజిత్‌ దోవల్‌ మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ ప్రాంతంలో భద్రత, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దాడులపై భారత్‌ వైఖరిని వివరించామని తెలిపారు. 
 
 తాలిబన్ల దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌ సుస్థిరతకు మార్గాలపై ఇరువురు చర్చించమని చెప్పారు. అమెరికాలో అక్టోబరులో జరగబోయే క్వాడ్‌ సమావేశాలపై కూడా వీరిరువురు చర్చించినట్లు తెలుస్తోంది.  క్వాడ్‌ దేశాలైన భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా అక్టోబరులో వాషింగ్టన్‌లో జరిగే సమావేశానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. 
 
అంతకు ముందు  ఆంటోనీ బ్లింకెన్ బౌద్ద ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. ద‌లైలామా ప్ర‌తినిధి నోడుప్ డాంగ్‌చుంగ్‌తో అమెరికా మంత్రి భేటీ కావ‌డం ఒక‌ర‌కంగా చైనాకు ఆగ్ర‌హం తెప్పించే విష‌యంమే. 1950లో చైనా ద‌ళాలు టిబెట్‌ను ఆక్ర‌మించాయి. 1959లో మ‌త‌గురువు ద‌లైలామా ఆ దేశం నుంచి పారిపోయారు. 
 
నోడుప్‌తో అమెరికా మంత్రి భేటీపై చైనా విదేశాంగ శాఖ ఎటువంటి స్పంద‌న ఇవ్వ‌లేదు. చైనాలో టిబెట్ అంత‌ర్భాగ‌మ‌ని, ద‌లైలామా తీవ్ర‌మైన వేర్పాటువాది అని డ్రాగ‌న్ దేశం ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, బ్లింకెన్‌ భారత్‌లో మొదటిసారి పర్యటిస్తుండటం గమనార్హం.