మీరాబాయికి స్వరాష్ట్రంలో బ్రహ్మరధం….  ప్రిక్వార్ట‌ర్స్‌లోకి పీవీ సింధు

 ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్‌లో ఘన స్వాగతం లభించింది. మంగళవారం స్థానిక బీర్‌ తికేంద్రజీత్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మీరాబాయికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

విమానాశ్రయానికి విచ్చేసిన మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌సింగ్‌ మీరాకు పూల బోకేతో స్వాగతం పలికారు. తల్లిదండ్రులు ఓంగ్బీ టాంబీ లైమా, సైఖోమ్‌ కృతి మితేయిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన మీరా కన్నీటి పర్యంతమైంది. కిక్కిరిసిన అభిమానుల కోలహలంలో పోలీసుల భద్రత మధ్య ఈ యువ లిఫ్టర్‌ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగింది. 

ఇంఫాల్‌ వీధుల్లో నుంచి ఊరేగింపు వెళ్తున్న క్రమంలో దారి పొడవున అభిమానులు, స్థానికులు మీరాపై పూల వర్షం కురిపించారు. మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వం చానును ఘనంగా సన్మానించింది. నజరానా ప్రకటించిన కోటి రూపాయల చెక్‌తో పాటు అడిషనల్‌ ఎస్పీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ను మీరాకు సీఎం బిరేన్‌సింగ్‌ అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులతో పాటు చిన్ననాటి కోచ్‌ అనితా చాను, మంత్రులు పాల్గొన్నారు. సన్మానం ముగిసిన తర్వాత తన స్వగ్రామం నాంగ్‌పోక్‌ కాక్‌చింగ్‌కు మీరా బయల్దేరి వెళ్లింది. ఇదిలా ఉంటే, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీరాకు రూ.2 కోట్ల నజరానాతో పాటు ప్రమోషన్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు.

ప్రిక్వార్ట‌ర్స్‌లోకి పీవీ సింధు
 
 ఇండియ‌న్ ఏస్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు ఒలింపిక్స్ ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. బుధ‌వారం జ‌రిగిన గ్రూప్ జే రెండో మ్యాచ్‌లోనూ ఆమె విజ‌యం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గ‌న్ యితో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16 తేడాతో వ‌రుస గేమ్స్‌లో గెలిచింది. అయితే  ప్ర‌త్యర్థి నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదురైంది. 14 పాయింట్ల వ‌ర‌కూ ఇద్ద‌రూ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. అయితే ఆ త‌ర్వాత పుంజుకున్న సింధు.. వ‌రుస‌గా పాయింట్లు సాధించింది.
 
తొలి మ్యాచ్‌లో కూడా సింధు ఇజ్రాయెల్ షట్లర్‌‌తో తలపడి కేవలం 28 నిమిషాల్లో మ్యాచును ముగించిన విషయం తెలిసిందే. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న సింధు భారత్‌కు మరో పతకాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.  
 
మరోవైపు భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడో మ్యాచులోనూ ఓడిపోయి నిరాశపరిచింది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచులో భారత అమ్మాయిలు 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.   ఆర్చ‌రీ మెన్స్ సింగిల్స్‌లో త‌రుణ్‌దీప్ రాయ్ పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో గెలిచి ఆశ‌లు రేపిన అత‌డు.. రౌండ్ ఆఫ్ 16లో పోరాడి ఓడిపోయాడు. షూట్ ఆఫ్ ద్వారా విజేత‌ను తేల్చిన ఈ రౌండ్‌లో 5-6 తేడాతో ఇజ్రాయెల్ ఆర్చ‌ర్ ఇతాయ్ షానీ చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యాడు.