హాకీలో స్పెయిన్‌పై భారత్‌ ఘన విజయం

ఒలిపింక్స్‌ హాకీలో స్పెయిన్‌పై టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించింది. పూల్‌-ఏ మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో రెండింట్లో విజయం గెలుపొందింది.

 మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌పై భారత జట్టు ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిక్వార్టర్‌ ముగిసే సరికి స్పెయిన్‌పై 2-0 గోల్స్‌ ఆధిక్యంలో భారత్‌ నిలిచింది. మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో రూపిందర్‌సింగ్‌ అదరగొట్టాడు. 

మ్యాచ్‌లో 15 నిమిషాలు, 51 నిమిషాల సమయంలో రెండు గోల్స్‌ వేసి, విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిమ్రన్‌జీత్‌ సింగ్‌ ఒక గోల్‌ సాధించాడు. మొదటి స్పెల్‌లో రెండు గోల్స్ చేసిన భారత జట్టు.. రెండవ స్పెల్‌లో కొంచెం రక్షణాత్మకంగా ఆడింది. స్పెయిన్ సైతం ఎదురుదాడికి దిగినా.. భారత్ ధీటుగానే ఎదుర్కొంది. స్పెయిన్‌కు రెండు పెనాల్టీ కార్నర్స్‌ లభించినా.. భారత్ ధీటుగా ఎదుర్కొని విజయాన్ని అందుకున్నది.

ఇలా ఉండగా, ఒలింపిక్స్-2021లో చైనా మూడో స్థానానికి పడిపోయింది. 7 గోల్డ్, 5 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. 8 పసిడి, 3 రజతం, 8 కాంస్య పతకాలతో మొత్తం 19 పతకాలు నెగ్గి అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో 8 బంగారు, 2 రజత, 3 కాంస్య పతకాలతో జపాన్ ఉంది. 

 ఇక భారత్ మీరాబాయి చాను గెలిచిన ఒకే ఒక్క రజత పతకంతో 34వ స్థానంలో ఉంది. బల్గేరియా, బెల్జియం, కొలంబియా, డెన్మార్క్, జోర్డాన్, రొమేనియా, దక్షిణాఫ్రికాలు కూడా ఒక్కో రజత పతకం గెలిచి భారత్‌తో కలిసి 34వ స్థానాన్ని పంచుకుంటున్నాయి.  ఇక ఇప్పటి వరకు దాదాపు 51 జట్లు (వివిధ దేశాలకు చెందిన నేషనల్ ఒలింపిక్ కమిటీలు) టోక్యో ఒలింపిక్స్ పతకాల వేటలో బోణీ కొట్టాయి.