భారత భూభాగంలో చైనా గుడారాలు

సరిహద్దు వివాదంపై ఓ పక్క సైనిక కమాండర్ల స్థాయి 12వ విడత చర్చలు ఈ  నెలాఖరుకు జరపాలని  నిర్ణయించినా, మరోవంక  చైనా అతిక్రమణలు సాగుతున్నాయి. భారత భూభాగంలో చైనా గుడారాలు ఏర్పాటు అవుతున్నాయి. లద్థాఖ్ తూర్పు ప్రాంతంలోని డెమ్‌చోక్ వద్ద ఉన్న చార్దింగ్ నాలా భారత భూభాగంలోకి వస్తుంది.

అయితే ఇటీవలి కాలంలో ఇక్కడ చైనా టెంట్లు కన్పించడంతో భారత గస్తీ బృందాలు కంగుతిన్నాయని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీటిని పౌరులు ఏర్పాటు చేసుకున్న టెంట్లుగా వీటిలోని వారు తెలిపారు. వీరు చైనీయులే అని వెల్లడైంది. అయితే ఇక్కడ టెంట్లు ఖాళీ చేయాలని తాము ఎన్నిసార్లు చెప్పినా, వీటిని తొలిగించడం లేదని అధికారులు తెలిపారు. టెంట్లలో ఉన్న వారు పౌరులేనా అనే అనుమానం తలెత్తుతోంది. 

డెమ్‌చౌక్ ప్రాంతం తరచూ భారత్ చైనా సైనిక ఘర్షణలకు నెలవు అయింది. సోమవారం కమాండర్ల స్థాయి సంప్రదింపులకు చైనా సైనికాధికారులు ప్రతిపాదించారు. అయితే కార్గిల్ విజయ్ దివస్ కావడంతో కుదరదని భారత్ తెలిపింది. తరువాత ఎప్పుడైనా చర్చలకు సిద్ధం అని స్పష్టం చేసింది.

డెమ్‌చోక్, ట్రిగ్ హైట్స్ ఎల్‌ఎసి వెంబడి వివాదాస్పద కేంద్రాలు అనే విషయాన్ని భారత్ చైనా ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇవి జగడాలకు మూలమవుతున్నాయని నిర్థారించాయి. 1990 ప్రాంతంలోనే భారత్ చైనా సంయుక్త కార్యాచరణ బృందాల భేటీలో ఈ కీలక ప్రాంతాల విషయం ప్రస్తావనకు వచ్చింది. 

వివాదాస్పద ప్రాంతాల వెంబడి చైనా టెంట్లు ఏర్పాటు కావడం భారత్‌కు ఆందోళన కల్గిస్తోంది. ఎల్‌ఎసి వెంబడి ఉండే పరస్పర వైరుద్ధ ప్రాంతాలు ఉభయపక్షాల మధ్య తరచూ ఘర్షణలకు దారితీస్తున్నాయి. టెంట్లు ఏర్పాటు కావడం పరిస్థితిని మరింత రెచ్చగొట్టేందుకు దారితీస్తుందని భారత్ భావిస్తోంది. 

టెంట్ల ఏర్పాటుతో తక్షణ ఉద్రిక్తతకు అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. అయితే కాలక్రమంలో ఇవి ఘర్షణలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్ప్ కమాండర్ స్థాయి సంప్రదింపులలో జాప్యం జరుగుతూ ఉన్నా, ఎప్పటికప్పుడు హాట్‌లైన్ల సంప్రదింపులు సాగుతున్నాయి. దౌలత్ బెగ్ ఓల్డీ, చూశూల్ వద్ద ఏర్పాటు అయిన హాట్‌లైన్స్‌తో ఇప్పటికీ ఉభయపక్షాలు 1500 కు పైగా సార్లు మాట్లాడుకున్నారు.