ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లకు నేపాల్ ప్రభుత్వం ఊరట

ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లకు నేపాల్ ప్రభుత్వం ఊరట
ప్రేమించుకునే టీనేజ్ జంటలకు ఊరటనిచ్చేలా నేపాల్‌లోని బాలేంద్ర షా ప్రభుత్వం ఒక సంచలన చట్ట సవరణకు శ్రీకారం చుట్టబోతోంది. పరస్పర అంగీకారంతో ప్రేమ బంధాల్లో ఉండే టీనేజర్లపై ఆటోమేటిక్‌గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు తమ దేశ అత్యాచార నిరోధక చట్టంలో ఒక ప్రత్యేకమైన ‘రోమియో జూలియట్’ క్లాజ్ తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
 
ఈ ప్రతిపాదిత సంస్కరణ ప్రకారం 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల జంటల మధ్య వయస్సు వ్యత్యాసం గరిష్టంగా మూడు సంవత్సరాల లోపు ఉంటే, వారి పరస్పర సమ్మతితో కూడిన సంబంధాలకు చట్టం నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే ఇదే సమయంలో లైంగిక వేధింపులు, బలవంతపు చర్యలు, దోపిడీలకు పాల్పడితే మాత్రం కఠినమైన శిక్షలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.18 ఏళ్ల లోపు ఉన్న వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకున్నా, వారిద్దరి మధ్య పరస్పర అంగీకారం ఉన్నప్పటికీ దానిని అత్యాచారంగానే పరిగణిస్తారు. దేశంలో చట్టబద్ధమైన వివాహ వయస్సు మాత్రం 20 ఏళ్లుగా ఉంది. ఈ నిబంధనల వల్ల క్షేత్రస్థాయిలో అనేక దారుణాలు జరుగుతున్నాయని న్యాయ నిపుణులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా కులాంతర ప్రేమాయణాలు సాగించే జంటలు లేదా ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకునే టీనేజ్ జంటల విషయంలో వారి ప్రేమ ఇష్టం లేని అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయిలపై అత్యాచార కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇలా చట్టాన్ని మైనర్ల రక్షణ కోసం కాకుండా, యువ జంటలను శిక్షించడానికి, ప్రేమలను విడదీయడానికి ఆయుధంగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం అవుతుంది. 
టీనేజ్ జంటలకు సంబంధించిన అనేక వివాదాస్పద కేసులు నేపాల్ కోర్టులకు చేరుతుండటంతో ఈ చట్ట సవరణ ప్రతిపాదన వేగవంతమైంది.  అయితే ఈ ప్రతిపాదనపై నేపాల్‌లోని బాలల హక్కుల సంఘాలు, మహిళా పక్షపాతులు పెదవి విరుస్తున్నారు. బాల్య వివాహాలు, లింగ వివక్షత, లైంగిక హింసతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్న నేపాల్ లాంటి దేశంలో ఇలాంటి మినహాయింపులు ఇస్తే బాలికల రక్షణ కవచం బలహీన పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ సభ్యురాలు మోహనా అన్సారీ స్పందిస్తూ “ఈ చట్టాన్ని మార్చే ముందు సామాజిక పరిస్థితులపై విస్తృతమైన చర్చ జరగాలి. లేదంటే ఈ మినహాయింపులు కూడా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు. ఈ చట్ట సవరణతో పాటు నేపాల్‌లో వివాహ వయస్సును 20 నుంచి 18 ఏళ్లకు తగ్గించాలనే మరో ప్రతిపాదనపై కూడా ప్రస్తుతం తీవ్రమైన మేధోమథనం నడుస్తోంది.