జూలై 31 నాటికి 51 కోట్ల డోసులు ఇచ్చి తీరుతాం

దేశంలో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మందకొడిగా సాగుతున్న‌దంటూ జ‌రుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ముందస్తుగా నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారమే వ్యాక్సినేష‌న్ కొనసాగుతున్న‌ద‌ని స్పష్టంచేసింది. జులై నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అస‌త్య‌మ‌ని కొట్టిపారేసింది.

గ‌తంలో చెప్పినట్లుగానే జులై 31 నాటికి దేశ‌వ్యాప్తంగా 51 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేసి తీరుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. జనవరి నుంచి జూలై చివరి నాటికి మొత్తం 51.60 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గతంలో ఆరోగ్య శాఖ తెలిపింది. ముందుగా నిర్దేశించుకున్న ప్ర‌కార‌మే రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ డోసుల‌ను కేటాయిస్తున్నామని పేర్కొన్న‌ది.

ఇప్పటికే 45.7కోట్ల డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేశామని, జూలై 31 నాటికి మిగతా 6.03 కోట్ల డోసుల పంపిణీ కూడా పూర్త‌వుతుంద‌ని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలకు సరఫరా చేసిన డోసుల్లోనూ ఇప్పటికే 44.19 కోట్ల వ్యాక్సిన్ డోసులు లబ్ధిదారులకు పంపిణీ జ‌రిగిన‌ట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారిలో 9.9 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారని స్పష్టంచేసింది.

మరోవంక,  ఆగ‌స్టు క‌ల్లా చిన్న‌పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ వెల్ల‌డించారు. ఇవాళ బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని త‌మ పార్టీ ఎంపీల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. 

ప్ర‌స్తుతం భారత్ లో రెండు కోవిడ్ టీకాల‌ను పిల్ల‌ల‌పై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు. జైడ‌స్ క్యాడిలా ఇచ్చిన రిపోర్ట్‌ను డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ ప‌రిశీలిస్తున్న‌ది. 12 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌ల‌పై జైడ‌స్ కోవిడ్ టీకా ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించింది. 

ఇక భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా 2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్ల‌ల‌పై రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు టీకాల ఫ‌లితాల ఆధారంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఉంటుంద‌ని ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ స‌హాయ మంత్రి భార‌తి ప‌వార్ తెలిపారు.