రాజ్ కుంద్రాకు కస్టడీ పొడిగింపు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై హైకోర్టు షాకిచ్చింది. జూలై 19న రాజ్ కుంద్రాను పోర్న్ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగ‌ళ‌వారంతో ఆయ‌న క‌స్ట‌డీ ముగుస్తుంది. ఆయ‌న బెయిల్ కోసం అప్పీలు చేసుకున్నారు. 
 
దీనికి సంబంధించిన తాజా విచార‌ణ‌లో ముంబై హైకోర్టు  రాజ్ కుంద్రాకు బెయిల్ ఇవ్వ‌లేదు. పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్తూ 14 రోజుల పాటు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపారు. ముంబై అంధేరిలో రాజ్ కుంద్రా వియాన్ ఇండ‌స్ట్రీస్‌లో పోలీసులు సోదాలు జ‌రిపిన‌ప్పుడు సీక్రెట్ అల్మ‌రాలో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టో క‌రెన్సీకి సంబంధించిన ప‌త్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కేసులో ఇంకా ఎవ‌రెవ‌రికీ లింకులున్నాయి అనే వివ‌రాల‌ను పోలీసులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
అలాగే ఫోర్నోగ్ర‌ఫీలో భాగ‌మైన వారిని ప్ర‌శ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే షెర్లిన్ చోప్రాకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేయ‌డం దుమారం రేపుతుంది.  అశ్లీల చిత్రాల కేసుకు సంబంధించి నటి షెర్లి చోప్రాకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసుల నుండి సమన్లు అందాయి. ఆమెను విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు సూచించారు. విచారణలో ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. 
 
రాజ్‌కుంద్రాతో పరిచయమున్న ప్రతీ ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఆ క్రమంలో నటి షెర్లి చోప్రాకు కూడా సమన్లు అందాయి. ఈ కేసుతో తనకు సంబంధమున్నట్లు దర్శకుడు తన్వీర్‌ హష్మి పోలీసులు ముందు ఒప్పుకున్నారు. తాము కలిసి 20-25 నిమిషాల నిడివితో ఓ షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసినట్లు తన్వీర్‌ హష్మి తెలిపారు.
అనుమానితుల పేర్లలో ఉన్న నటి ఫ్లోరా సైని స్పందిస్తూ  తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని చెప్పారు. తాను నటిగా పలు సినిమాల సన్నివేశాలలో నటించాను కానీ రాజ్‌కుంద్రాతో ఎలాంటి పరిచయమూ లేదన్నారు.  అశ్లీల చిత్రాలకు తాను దూరంగా ఉంటానని, కొందరు వాట్సాప్‌లలో, ఛాటింగ్‌లలో తన పేరును ప్రస్తావించినంతమాత్రాన వారితోపాటు తాను కూడా కలిసి పనిచేసినట్లు కాదని చెప్పారు.

ఇదిలా ఉండగా… పోలీసుల అదుపులో ఉన్న రాజ్‌కుంద్రాకు చెందిన బ్యాంక్‌ ఖాతాలన్నిటినీ ముంబయి పోలీసులు బ్లాక్‌ చేశారు. కాన్పూర్‌లోని ఎస్‌బిఐ శాఖలో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలకు ఉన్న ఖాతాలను నిలిపివేయాలని అక్కడి బ్యాంకు యాజమాన్యానికి సూచించారు.