అసోం- మిజోరాం సరిహద్దు కాల్పుల్లో 6 గురు అస్సాం పోలీసుల మృతి 

అసోం- మిజోరాం సరిహద్దుల్లో సోమవారం చెలరేగిన ఘర్షణల్లో ఆరుగురు పోలీస్‌ అధికారులు మరణించినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత్‌ బిస్వా శర్మ తెలిపారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన కాచార్‌ జిల్లా- కొలాసిబ్‌ జిల్లాల్లో కాల్పులు జరిగాయని, ప్రభుత్వ వాహనాలపై దాడులు జరిగాయని చెప్పారు. 

‘‘అసోం, మిజోరం సరిహద్దుల్లో చెలరేగిన అల్లర్లలో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన చాలా బాధించింది. ఆ కుటుంబాలకు నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను’’ అంటూ సీఎం హిమంత బిశ్వశర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

 అస్సాం కాచర్ జిల్లా, మిజోరాం కోలాసిబ్ జిల్లా సరిహద్దులోని వివాదస్పద ప్రాంతంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆరు గుడెసెలకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత వాసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరారు. 

కర్రలు, ఇనుప రాడ్లతో హంగామా చేసి కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసులు, సరిహద్దు ప్రాంత వాసుల మధ్య ఘర్షణ జరిగి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఆరుగురు అస్సాం పోలీస్‌ అధికారులు చనిపోగా మరి కొందరు గాయపడ్డారు. మిజోరం సీఎం జోరంతాంగ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోక్యం చేసుకోవాలని కోరారు.

ఇటీవల రెండు రోజుల పాటు మిజోరంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సరిహద్దు సమస్యను అస్సాం, మిజోరం సీఎంలు కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన పర్యటన ముగిసిన మరునాడే సరిహద్దులోని వివాదస్పద ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫోన్‌లో ఇరు సీఎంలతో మాట్లాడిన అమిత్‌ షా ఇరువైపులా పోలీస్ బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సిఎంలు అమిత్‌షాను ట్యాగ్‌ చేస్తూ  వరుస ట్వీట్లు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య జూన్‌లో చివరి ఘటన చోటు చేసుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు మిజోరాం ప్రభుత్వం సరిహద్దు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు డిప్యూటీ సిఎం టాన్లూయా అధ్యక్షత వహిస్తుండగా, హోంమంత్రి లాల్‌చామ్లియాను ఉపాధ్యక్షులుగా నియమించారు. కాగా, అసోంకు మిజోరాంతో పాటు  మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లతో కూడా సరిహద్దు వివాదాలు ఉన్నాయి.