గగన్‌యాన్ తొలిదశకు లాక్‌డౌన్ బ్రేక్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌లో తొలి అడుగుకు విఘ్నం ఏర్పడింది. డిసెంబర్‌లో తలపెట్టిన గగన్‌యాన్ తొలి సిబ్బందిరహిత యాత్ర జాప్యం అవుతుందని సోమవారం ఇస్రో ఛైర్మన్ కె శివన్ తెలిపారు. రోదసీలోకి మానవసహిత వ్యోమనౌకలను పంపించేందుకు ఇస్రో గగన్‌యాన్ కార్యక్రమాన్ని చెపట్టింది. 

దీనికి ముందు రెండు సార్లు మనుష్యులు ఎవరూ లేకుండా తొలి దశను పూర్తి చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ సంబంధిత లాక్‌డౌన్ల పరిణామాలతో సకాలంలో హార్డ్‌వేర్ సాధనసంపత్తి అందడం లేదని దీనితో డిసెంబర్ మిషన్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని శివన్ తెలిపారు. డిసెంబర్ నాటికి ఇది సాధ్యం అయ్యే అవకాశం లేదనే చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

సిబ్బంది రహిత మిషన్ వచ్చే ఏడాదికి ఆరంభం కావచ్చునని చెప్పారు. పలు రాష్ట్రాలలోని కంపెనీల నుంచి ఇస్రో కేంద్రాలకు హార్డ్‌వేర్ అందాల్సి ఉంది. గగన్‌యాన్ నిర్ధేశిత శాస్త్రీయ ప్రమాణాల పరిధిలో మానవయుత యాత్రకు ముందుగా రెండు సార్లు ఎవరూ లేకుండా రోదసీలోనికి స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపించాల్సి ఉంటుంది. 

ఇస్రో నుంచే అత్యధిక భాగం గగన్‌యాన్ సంబంధిత నౌకలు, సాంకేతికలకు డిజైన్, అనాలిసిస్, భద్రతా ప్రమాణాల పాటింపు వంటివి జరిగాయి. అయితే కొన్ని రకాల హార్డ్‌వేర్‌లు దేశంలోని వందలాది పరిశ్రమల నుంచి అందాల్సి ఉంది. లాక్‌డౌన్లతో ఉత్పత్తి నిలిచిపోవడం వంటి పరిణామాలతో చివరికి గగన్‌యాన్ లక్ష్యం మరింత సుదూరం అయింది.