మీరాబాయి చాను రజితం స్వర్ణం కానుందా!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఖాతాలోకి మొదటి పతకాన్ని సాధించిన అథ్లెట్‌ మీరాబాయి చాను. కరణం మల్లీశ్వరి తర్వాత మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల పోటీల్లో మీరాబాయి (21) రజత పతకం సాధించి చరిత్ర సృష్టించారు. అయితే ఆమె పతకం వెండి నుంచి బంగారానికి మారనుందా? 

ఇదే విభాగంలో స్వర్ణం సాధించిన చైనా అథ్లెట్‌ జిహుయి హుకి డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు మీడియా ప్రకటించింది. 49 కిలోల విభాగంలో జిహుయి మొత్తం 210 కిలోలు లిఫ్ట్ చేసి  పసిడి పతకం సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116 కిలోలు లిఫ్ట్‌ చేసి విజయం సాధించింది. 

మీరాబాయి స్నాచ్‌లో 87కి, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115కిలోలు మొత్తంగా 202 కిలోలను లిఫ్ట్‌ చేసి రజత పతకాన్ని సాధించారు. కొన్ని కారణాల వల్ల జిహూయిని నిర్వాహకులు ఒలింపిక్‌ గ్రామంలోనే ఉండాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. ఆమెకు మరోసారి డోప్‌ పరీక్షలు చేయనున్నారని మీడియా వెల్లడించింది.

ఆ పరీక్షల్లో జిహుయి విఫలమైతే మీరాబాయి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. దీంతో రజతం నుండి స్వర్ణ పతకానికి మార్చవచ్చు. అయితే ఈ అంశంపై మరింత సమాచారం, స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, మీరాబాయి ఇప్ప‌టికే భారత్‌కు తిరుగు ప్ర‌యాణ‌మైంది. సోమవారం ఉద‌యం స్వదేశానికి ఫ్లైటెక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కోచ్‌తో దిగిన ఫొటోను ఆమె ట్విట‌ర్‌లో షేర్ చేసింది.

 మరోవంక, టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చానుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఆమెను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా నియమించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తెలిపారు. ఇటీవల ప్రకటించినట్టు ఆమె కోటి రూపాయల రివార్డు అందించనున్నట్టు చెప్పారు. దీనికి అదనంగా ఈ పోస్టులో ఆమెను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు.

అలాగే జూడో క్రీడాకారిణి లిక్మాబమ్ సుశీల దేవిని కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోట్ చేయనున్నట్టు చెప్పిన సీఎం.. ఒలిపింక్స్‌లో పాలుపంచుకున్నందుకు గాను రూ. 25 లక్షల రివార్డు ఇవ్వనున్నట్టు వివరించారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజత పతకం అందించిన మీరాబాయి చాను ఈ రోజు స్వదేశం చేరుకుంది. న్యూ ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె ల్యాండ్ అయిన వెంటనే అభిమానులు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.