45 రోజుల్లో ఎంఎస్ఎంఈల బ‌కాయిలు చెల్లిస్తాం

సూక్ష్మ‌, చిన్న మ‌ధ్య‌త‌ర‌హా సంస్ధ‌ల (ఎంఎస్ఎంఈ)కు చెల్లించాల్సిన బ‌కాయిల‌ను 45 రోజుల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సోమ‌వారం లోక్‌స‌భలో వెల్ల‌డించారు. ఎంఎస్ఎంఈల‌కు పెండింగ్‌లో ఉన్న ఎలాంటి చెల్లింపులైనా 45 రోజుల్లో చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని, తాను వ్య‌క్తిగ‌తంగా ఈ అంశాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నాన‌ని మంత్రి చెప్పారు.

ప్ర‌శోత్న‌రాల స‌మ‌యంలో ఎంఎస్ఎంఈల‌కు ప్ర‌భుత్వ చెల్లింపుల్లో జాప్యంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ నిర్మ‌లా సీతారామ‌న్ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. క‌రోనా మ‌హమ్మారితో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ పరిశ్ర‌మ ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని కొంత‌కాలంగా డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు ప్ర‌భుత్వ రంగ సంస్ధ‌ల నుంచి రూ 5 ల‌క్ష‌ల కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయ‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు పేర్కొన్నాయి. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్ధ‌కు వెన్నుద‌న్నుగా నిలిచే ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకుంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం గ‌త కొంత‌కాలంగా భ‌రోసా ఇస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారితో కుదేలైన ఈ ప‌రిశ్ర‌మ కోలుకునేందుకు రుణాల పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ‌తో పాటు ప‌లు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని ఆర్‌బీఐ ప‌లుమార్లు స్ప‌ష్టం చేసింది.

ఇలా ఉండగా, క‌రోనాతో త‌లెత్తిన సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి కొత్త నోట్లు ముద్రించే ఆలోచ‌నే ప్ర‌భుత్వానికి లేద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు.క‌రోనాతో త‌లెత్తిన సంక్షోభ ప‌రిష్కారానికి కొత్త నోట్ల‌ను ముద్రించ‌డం కాద‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ద‌ని ఆమె చెప్పారు. క‌రోనా వ‌ల్ల గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో జీడీపీ 7.3 శాతానికి కుదించుకుపోయింద‌ని చెబుతూ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి త‌మ ప్ర‌భుత్వం ఆత్మ నిర్బ‌ర్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న‌ద‌ని పేర్కొన్నారు.