స్విస్ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్ మనీ డేటా లేదు 

స్విట్జ‌ర్లాండ్ బ్యాంకుల్లో గ‌త 10 ఏండ్ల‌లో న‌ల్ల‌ధ‌నం నిల్వ‌ల స‌మాచారంపై ఎటువంటి అధికారిక స‌మాచారం లేద‌ని ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా  లోక్‌సభకు స్పష్టం చేశారు. హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల ఖాతాల్లో రూ.8,465 కోట్ల ఆదాయం ఉంద‌ని, వాటిపై రూ.1,294 కోట్ల జ‌రిమానా విధించామ‌ని తెలిపారు.

అయితే, ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టులు (ఐసీజే) ఆధ్వ‌ర్యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల ఖాతాల్లో రూ.11,019 కోట్లు ఉన్నాయి. ప‌నామా పేప‌ర్స్ లీక్‌లో రూ.20,078 కోట్లు, ప్యార‌డైజ్ పేప‌ర్ లీక్స్‌లో రూ.246 కోట్లు బ‌య‌ట ప‌డ్డాయ‌ని పేర్కొన్నారు. 

అంతే కాకుండా స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తీసుకురావడానికి ప్రభుత్వం విడతల వారీగా కొన్ని చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.  కొద్ది రోజుల క్రితం కేంద్ర నిర్మలా సీతారామన్ కూడా ఇదే సమాధానం చెప్పారు. స్విస్ బ్యాంకుల్లో 20,700 కోట్ల రూపాలయకు పైగా సొమ్మును భారతీయులు దాచిపెట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి నిర్మలా కొట్టి పారేశారు.

ఆ డబ్బు ఎన్ఆర్ఐలది కాదని, అది ఇతర దేశాలకు చెందిన వ్యక్తులదని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా 2019 నుంచి ఖాతాదారుల డిపాజిట్లు తగ్గిపోయాయని వెల్లడించారు. అయితే, వీరంతా బాండ్లు, సెక్యూరిటీస్, ఇతర ఫైనాన్షియల్ విధానంలో జమ చేస్తూ వస్తున్నారు.