ప్రముఖ నటి జయంతి కన్నుమూత

ప‌లు దక్షిణాది చిత్రాల్లో న‌టించి మెప్పించిన సీనియ‌ర్ న‌టి జ‌యంతి (76) ఆదివారం రాత్రి అనారోగ్యంతో క‌న్నుమూశారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. 
 
చికిత్స పొందుతూ జ‌యంతి క‌న్నుమూశారు. మూడు ద‌శాబ్దాలుగా జ‌యంతి అస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారు. 1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించిన జ‌యంతి కన్నడ సినిమా ‘జెనుగూడు(1963)’తో తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటిగా తనదైన ముద్ర వేశారు. 
 
ఇప్పటి వరకు దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన ఈమె 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. తెలుగులో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించారు. 
 
దిగ్గజ నటులు ఎంజీ రామచంద్రన్‌, ఎన్టీఆర్‌, రాజ్‌కుమార్‌, రజనీకాంత్‌లతో కలిసి నటించారు. ఉత్తమ నటిగా రెండుసార్లు కర్ణాటక ఫిలిం ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.  జయంతి హఠాన్మరణంతో కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.